Jagan: 'ఏపీ దిశ యాక్ట్'పై జగన్ మరిన్ని నిర్ణయాలు!
- ఇటీవల అమలులోకి వచ్చిన కొత్త చట్టం
- సీఎస్, డీజీపీలతో జగన్ సమీక్ష
- వెంటనే చట్టాన్ని అమల్లోకి తేవాలని ఆదేశం
ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల అమలులోకి వచ్చిన ఏపీ దిశ యాక్ట్ పై సీఎం వైఎస్ జగన్ మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చట్టం విధివిధానాలపై ఈ ఉదయం చీఫ్ సెక్రటరీ నీలం సాహ్నీ, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఇతర ముఖ్య అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అసెంబ్లీ ఆమోదించిన చట్టాన్ని వెంటనే అమలులోకి తేవాలని జగన్ ఆదేశించారు.
అన్ని జిల్లాల్లో ఒక్కో స్పెషల్ కోర్టును వెంటనే ఏర్పాటు చేయాలని, ఆ కోర్టుల్లో అత్యాచార, హత్యాచార, మహిళలపై అఘాయిత్యాల కేసులనే విచారించి, త్వరితగతిన శిక్షలు విధించేలా చూడాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం నుంచి చట్టానికి ఆమోదం కోసం వేచి చూస్తున్నామని అధికారులు వ్యాఖ్యానించడంతో, ఈలోగానే చట్ట అమలుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని జగన్ ఆదేశించినట్టు సమాచారం. ఈలోగా పెండింగ్ కేసులన్నీ పరిష్కరించ వచ్చని సూచించిన జగన్, అత్యాచార కేసుల్లో డీఎన్ఏ పరీక్షలను 48 గంటల్లోనే పూర్తి చేసి, సైంటిఫిక్ ఎవిడెన్స్ ను కలెక్ట్ చేయాలని కోరారు.