Miss World: మిస్ వరల్డ్ టైటిల్ ను తృటిలో మిస్ అయిన భారత్... మూడో స్థానంలో సుమన్ రావు!
- లండన్ లో మిస్ వరల్డ్ పోటీలు
- కిరీటాన్ని దక్కించుకున్న జమైకా సుందరి టోనీ-ఆన్ సింగ్
- సెకండ్ రన్నరప్ గా నిలిచిన సుమన్ రావు
లండన్ లోని ఎక్సెల్ లండన్ కన్వెన్షన్ సెంటర్ లో శనివారం రాత్రి అత్యంత వైభవంగా సాగిన మిస్ వరల్డ్ పోటీల్లో భారత్‌కు చెందిన సుమన్ రావు తృటిలో కిరీటాన్ని మిస్ చేసుకుంది. జమైకాకు చెందిన టోనీ–ఆన్ సింగ్, 2019 సంవత్సరానికిగాను మిస్ వరల్డ్ గా ఎంపికైంది. సుమన్ రావు సెకండ్ రన్నరప్ గా నిలువగా, ఫ్రాన్స్ సుందరి ఓప్లి మెజినో ఫస్ట్ రన్నరప్ గా ఎంపికైంది. గత సంవత్సరం మిస్ వరల్డ్ గా నిలిచిన మెక్సికో అందాల భామ వనెస్సా పొన్స్, టోనీ–ఆన్ సింగ్ తలపై కిరీటాన్ని అలంకరించింది.
గత నెల 20వ తేదీ నుంచి ఈ పోటీలు మొదలైన సంగతి తెలిసిందే. మొత్తం 120 దేశాలకు చెందిన అమ్మాయిలు మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనగా, ఫైనల్స్ కు 10 మంది అర్హత సాధించారు. వీరిని పలు ప్రశ్నలు అడిగిన ప్రముఖ వ్యాఖ్యాత పియర్స్ మోర్గాన్ నేతృత్వంలోని బృందం, సమాధానాల ఆధారంగా విజేతలను ప్రకటించింది.