KCR: కేసీఆర్ ఆదేశాలను కూడా అధికారులు పట్టించుకోవడం లేదు: అశ్వత్థామరెడ్డి
- యూనియన్లు ఉండాలా? వద్దా? అనే విషయంపై రహస్య ఓటింగ్ నిర్వహించాలి
- హైదరాబాదులో వెయ్యి బస్సులను రద్దు చేస్తున్నారు
- సమ్మె కాలంలో కొందరు అధికారులు అవినీతికి పాల్పడ్డారు
మహిళల పని వేళల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలను కూడా అధికారులు పట్టించుకోవడం లేదని ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్ అశ్వత్థామరెడ్డి అన్నారు. రెండేళ్ల పాటు యూనియన్లు వద్దంటూ ఆర్టీసీ కార్మికులతో సంతకాలు చేయించుకుంటుండటం సరికాదని విమర్శించారు. యూనియన్లు ఉండాలా? వద్దా? అనే విషయంపై రహస్య ఓటింగ్ నిర్వహించాలని... మెజార్టీ ఉద్యోగుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులు ఎవరూ సంతోషంగా లేరని చెప్పారు.
హైదరాబాదులో 3,500 బస్సుల్లో వెయ్యి బస్సులను రద్దు చేస్తున్నారని అశ్వత్థామరెడ్డి అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ చర్య వల్ల ఖర్చులు తగ్గుతాయేమో కానీ... ప్రజలకు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదురౌతాయని చెప్పారు. సమ్మె కాలంలో కొందరు అధికారులు అవినీతికి పాల్పడ్డారని... వారిపై విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.