Pawan Kalyan: పవన్ కల్యాణ్ సమాజానికి ప్రమాదకరం: జనసేనకు గుడ్ బై చెప్పిన రాజు రవితేజ

  • పవన్ సన్నిహితుడిగా గుర్తింపు పొందిన రాజు రవితేజ
  • జనసేన సిద్ధాంతకర్తగా ప్రచారం
  • పవన్ పై తీవ్ర వ్యాఖ్యలు

జనసేన పార్టీ ఆవిర్భావంలో కీలకపాత్ర పోషించిన రాజు రవితేజ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర ఆరోపణలు చేయడమే కాదు, ఏకంగా పార్టీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. జనసేన వ్యవస్థాపనకు ముందు నుంచి పవన్ తో సాన్నిహిత్యం ఉన్న రాజు రవితేజ ఒకరకంగా పార్టీకి అవసరమైన భావజాలాన్ని, సైద్ధాంతిక బలాన్ని అందించడంలో ముఖ్యభూమిక పోషించినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు జనసేన పొలిట్ బ్యూరో సభ్యుడిగానూ ఉన్నారు. పవన్ కు రైట్ హ్యాండ్ అనే రీతిలో పార్టీ వర్గాల్లో రాజు రవితేజకు గుర్తింపు ఉంది. తాజాగా ట్విట్టర్ లో అతను చేసిన ప్రకటన జనసేనకు, పవన్ కల్యాణ్ కు దిగ్భ్రాంతి కలిగించకమానదు.

ఇకపై తాను జనసేనలో ఏ స్థాయిలోనూ పనిచేయడం లేదని, పవన్ తోనూ, జనసేనతోనూ తనకు ఇక ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ అనైతిక విధానాలు, అవాంఛనీయ వ్యవహార సరళి నచ్చకనే వెళ్లిపోతున్నట్టు స్పష్టం చేశారు. ఒక వర్గంపై మరొక వర్గంలో విషబీజాలు నాటుతూ పవన్ గనుక తను అనుకున్నది సాధించగలిగితే రాష్ట్రానికి అతనంత ప్రమాదకారి మరొకరు ఉండరని వ్యాఖ్యానించారు.

 పవన్ లో విషపూరిత ఆలోచనలు, ప్రతీకార ధోరణి బలంగా కనిపిస్తున్నాయని, ఇలాంటి నాయకుడ్ని అధికారం చేపట్టకుండా ఆపాలని రాజు రవితేజ పిలుపునిచ్చారు. పవన్ లక్ష్యం నెరవేరితే సమాజంలో విద్వేషాలు పెచ్చరిల్లే ప్రమాదం ఉందని, అలాంటి వ్యక్తి ద్వేషపూరిత బీజాలు నాటుతూ ఉంటే చూస్తూ ఊరుకోలేక ఇంత కఠినంగా విమర్శించాల్సి వస్తోందని ఓ వీడియోలో వివరించారు.

Pawan Kalyan
Raju Raviteja
Jana Sena
Andhra Pradesh
Telangana
  • Error fetching data: Network response was not ok

More Telugu News