Ys viveka: వైఎస్ వివేకా హత్య కేసులో ట్విస్ట్.. సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేసిన బీటెక్ రవి!
- బాబాయి కేసును జగన్ పట్టించుకోవడం లేదు
- ఏపీ ప్రభుత్వంపై నమ్మకం లేదు
- అందుకే, సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టుకు వెళ్లా
వైఎస్ వివేకా హత్య కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, సీఎం జగన్ బాబాయి హత్యకు గురై ఏడాది గడుస్తున్నా ఆయన పట్టించుకోవడం లేదని విమర్శించారు.
ఈ కేసు విచారణ విషయంలో ఏపీ ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని, అందుకే, సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ పిటిషన్ వేసినట్టు చెప్పారు. అమాయకులకు శిక్ష పడకూడదని, ఈ పిటిషన్ తో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని, ఇది తన వ్యక్తిగతమని స్పష్టం చేశారు.
ఈ హత్య కేసుతో ఎలాంటి సంబంధం లేని తమను విచారిస్తున్నారని, ఈ హత్య వెనుక తన ప్రమేయం ఉంటే కనుక ఎలాంటి శిక్షకైనా తాను సిద్ధమేనని అన్నారు. వివేకా అజాతశత్రువని, ఆయనతో తనకు ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. సీబీఐతో విచారణ జరిపించాలని కోరిన వివేకా కూతురు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.