Disha: దిశ ఘటన, ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలతో తెలంగాణ పరువుపోయింది: ఉత్తమ్ కుమార్
- టీఆర్ఎస్ సర్కారుపై ఉత్తమ్ వ్యాఖ్యలు
- కేసీఆర్ సర్కారు వల్ల ప్రజలకు ఒరిగిందేమీలేదన్న టీపీసీసీ చీఫ్
- ఏ ఏడాదంతా అరాచకాలతో నిండిపోయిందని వెల్లడి
టీఆర్ఎస్ సర్కారుపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు చేశారు. ఈ ఏడాదంతా అరాచకాలతోనే గడిచిపోయిందని అన్నారు. టీఆర్ఎస్ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చినా ప్రజలకు జరిగిన ప్రయోజనం శూన్యమని వ్యాఖ్యానించారు. మద్యం ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవడంలో మాత్రం అభివృద్ధి సాధించారని వ్యంగ్యం ప్రదర్శించారు. దిశ ఘటన వంటి దారుణాలు, ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలతో తెలంగాణ రాష్ట్రం పరువు పోయిందని విమర్శించారు.
మరోవైపు రాష్ట్ర ఆర్థికస్థితి కూడా దిగజారిందని, కేసీఆర్ అసమర్థ నిర్ణయాలే అందుకు కారణమని ఆరోపించారు. లక్షల కోట్ల వ్యయంతో కాళేశ్వరం, మిషన్ కాకతీయ ప్రాజెక్టులు తీసుకువచ్చింది కమిషన్ల కోసమేనని మండిపడ్డారు. ఇప్పుడు ఆర్థిక క్రమశిక్షణ గురించి మాట్లాడుతున్న కేసీఆర్ కు, కొత్త అసెంబ్లీ, కొత్త సచివాలయం కట్టాలనుకున్నప్పుడు ఆ విషయం ఎందుకు జ్ఞప్తికి రాలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు.