Pawan Kalyan: వైసీపీ మద్దతుదారులు రాపాక గారికి క్షమాపణ చెప్పాలి: పవన్ కల్యాణ్
- అసెంబ్లీలో ఇంగ్లీషు మీడియంకు అనుకూలంగా రాపాక వ్యాఖ్యలు
- జనసేన షోకాజ్ నోటీసులు జారీ చేసిందంటూ ప్రచారం
- మండిపడిన పవన్ కల్యాణ్
జనసేన ఎకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కు పార్టీ నుంచి షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయన్న వార్త మీడియాలో శరవేగంగా పాకిపోయింది. జనసేనాని పవన్ కల్యాణ్ ఇంగ్లీషు మీడియం వద్దంటుంటే, అందుకు విరుద్ధంగా ఇంగ్లీషు మీడియం కావాల్సిందేనన్న రాపాకపై జనసేన ఆగ్రహం వ్యక్తం చేస్తోందంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై పవన్ కల్యాణ్ వివరణ ఇచ్చారు. ఇది వైసీపీ మద్దతుదారుల దుష్ప్రచారం తప్ప మరొకటి కాదని స్పష్టం చేశారు.
నిన్న తాను రైతు సౌభాగ్య దీక్షలో ఉన్నానని, కానీ రాపాక గారికి పార్టీ నుంచి షోకాజ్ నోటీసులు వెళ్లాయని వైసీపీతో సంబంధం ఉందన్న వెబ్ సైట్ లోనే మొదటగా పబ్లిష్ అయిందని తెలిపారు. ఈ వెబ్ సైట్ లో వార్త రావడం వెనుక ఎవరు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని పేర్కొన్నారు. తప్పుడు వార్తలు ప్రచురించినందుకు వైసీపీ మద్దతుదారులు రాపాక గారికి క్షమాపణలు చెప్పాలని పవన్ డిమాండ్ చేశారు.
నియోజకవర్గ ప్రజలు కూడా ఈ విషయాన్ని ఖండించాలని, గతంలో రాపాక గారిని అరెస్ట్ చేసినప్పుడు వైసీపీ నాయకులు బెయిల్ రానివ్వకుండా చేస్తే తాను స్వయంగా రంగంలోకి దిగానని, దాంతో వైసీపీ నేతలు వెనక్కి తగ్గారని పవన్ వెల్లడించారు. ఈ విషయాన్ని నియోజకవర్గ ప్రజలు గుర్తించాలని స్పష్టం చేశారు.