Supreme Court: శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై గతంలో ఇచ్చిన తీర్పుపై స్టే లేదు: సుప్రీంకోర్టు
- శబరిమలకు వెళ్లే మహిళల రక్షణపై దాఖలైన పిటిషన్లు
- సుప్రీంకోర్టులో విచారణ
- రివ్యూ పిటిషన్లపై త్వరలోనే విస్తృత ధర్మాసనం ఏర్పాటు చేస్తామన్న సుప్రీంకోర్టు
- ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాంటి ఆదేశాలూ ఇవ్వలేం
శబరిమలకు వెళ్లే మహిళల రక్షణపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. శబరిమల అంశంపై వచ్చిన రివ్యూ పిటిషన్లపై త్వరలోనే విస్తృత ధర్మాసనం ఏర్పాటు చేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. మహిళల ప్రవేశంపై గతంలో ఇచ్చిన తీర్పుపై స్టే లేదని స్పష్టం చేసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ విషయంపై ఎలాంటి ఆదేశాలూ ఇవ్వలేమని తెలిపింది.
శబరిమల అయ్యప్ప ఆలయంలోకి ఏ వయసు మహిళలైనా సరే వెళ్లి పూజల్లో పాల్గొనవచ్చని 2018, సెప్టెంబర్ 28న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ ఆలయంలో 10 నుంచి 50 ఏళ్ల లోపు మహిళల ప్రవేశంపై శతాబ్దాలుగా ఉన్న నిషేధాన్ని ఎత్తేసింది. అయితే, దీనిపై రివ్యూ పిటిషన్ లు వచ్చాయి. దీంతో శబరిమలలో మహిళల ఆలయ ప్రవేశం అంశాన్ని సుప్రీంకోర్టు ఇటీవల విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది.