Dish TV: డిష్ టీవీ, ఎయిర్ టెల్ డీటీహెచ్ విలీనం... ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీగా ఆవిర్భావం!

  • తుది దశకు చేరుకున్న చర్చలు
  • విలీనం తరువాత 4 కోట్ల మంది కస్టమర్లు
  • పెట్టుబడులను కొనసాగించనున్న వార్ బర్గ్ పింకస్

ప్రపంచంలోనే అతిపెద్ద టీవీ ప్రసారాల సంస్థ ఇండియాలో ఆవిర్భవించనుంది. ఎయిర్ టెల్ డిజిటల్ టీవీ, డిష్ టీవీల విలీనం దిశగా చాలాకాలంగా సాగుతున్న చర్చలు తుది దశకు వచ్చాయి. ప్రైవేటు ఈక్విటీ సంస్థ వార్ బర్గ్ పింకస్ తో పాటు రెండు కంపెనీల ప్రమోటర్లు ఒప్పందంపై ఓ అంగీకారానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా తొలుత డిష్ టీవీ, తన డీటీహెచ్ (డైరెక్ట్ టు హోమ్) వ్యాపారాన్ని వేరు చేసి, ఆపై దాన్ని భారతీ టెలీ మీడియాలో విలీనం చేస్తుంది. ఆపై ఇరు కంపెనీల కలయికలో ఏర్పడే సంస్థ 4 కోట్ల మంది వినియోగదారులతో, 62 శాతం మార్కెట్ వాటాను కలిగివుంటుంది.

కాగా, ఈ సంవత్సరం సెప్టెంబర్ నాటికి డిష్ టీవీకి 2.39 కోట్లు, ఎయిర్ టెల్ డిజిటల్ కు 1.62 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. మిగిలిన డిటీహెచ్ వినియోగదారుల్లో 25 శాతం మంది టాటా స్కై, మిగతా వారు సన్ డైరెక్ట్ కస్టమర్లుగా ఉన్నారు. వీడియోకాన్, రిలయన్స్ డిజిటల్ కంపెనీలు ఇప్పటికే ఇతర కంపెనీల్లో విలీనం అయ్యాయి. తాజా విలీనం తరువాత ఏఆర్పీయూ (యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్)పై ఒత్తిడి తగ్గుతుందని ఐడీఎఫ్సీ అభిప్రాయపడింది.

కాగా, 2017లో భారతీ టెలీ మీడియాలో 350 మిలియన్ డాలర్లు పెట్టుబడిని పెట్టి, 20 శాతం వాటాను కొనుగోలు చేసిన వార్ బర్గ్ పింకస్ నిర్ణయం ఈ డీల్ కు అత్యంత కీలకం. ఎయిర్ టెల్ డీటీహెచ్, డిష్ టీవీల విలీనం తరువాత కూడా తమ పెట్టుబడులను కొనసాగిస్తామని ఆ సంస్థ స్పష్టం చేయడంతో అడ్డంకులు తొలగినట్లయింది. డీల్ తరువాత భారతీ టెలీ మీడియా ఐపీఓకు వచ్చి, నిధుల సమీకరణ తరువాత స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ కు కూడా వస్తుందని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News