mantralayam: మంత్రాలయం ఆలయానికి విశిష్ట గౌరవం.. స్వచ్ఛ జాబితాలో చోటు!
- స్వచ్ఛ జాబితాలో మూడో దశలో ఆలయం ఎంపిక
- లోక్‌సభలో వెల్లడించిన కేంద్ర మంత్రి
- ఐదువేల మొక్కలతో ఉద్యానవనాలు తీర్చిదిద్దుతామన్న మంత్రి
కర్నూలు జిల్లా మంత్రాలయంలోని రాఘవేంద్రస్వామి ఆలయానికి విశిష్ట గౌరవం దక్కింది. ప్రముఖ స్వచ్ఛ స్థలాల జాబితాలో ఈ ఆలయానికి స్థానం దక్కింది. ఈ మేరకు కేంద్రం ప్రకటించింది. స్వచ్ఛ జాబితా మూడో దశలో మంత్రాలయం ఆలయాన్ని ఎంపిక చేసినట్టు కేంద్ర మంత్రి రతన్‌లాల్ కటారియా లోక్‌సభకు తెలిపారు. ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఆయనీ విషయాన్ని పేర్కొన్నారు. మూడో దశలో మొత్తం 10 స్వచ్ఛ స్థలాలను కేంద్రం ఎంపిక చేయగా, అందులో మంత్రాలయం ఒకటి కావడం గమనార్హం.
మంత్రాలయంలో 100 శాతం ఓడీఎఫ్ సాధనకు మరుగుదొడ్లు నిర్మిస్తామని, మంత్రాలయం స్వచ్ఛతకు మరిన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. అలాగే, భద్రత పెంచుతామని, ఐదువేల మొక్కలతో ఉద్యానవనాలను తీర్చిదిద్దుతామని మంత్రి వివరించారు.