Janasena: వైసీపీ ప్రభుత్వాన్ని మర్యాదగానే అడుగుతున్నా..: పవన్ కల్యాణ్
- రైతులకు న్యాయం జరగాలని కోరుకుంటున్నా
- ధాన్యపు బస్తాకు రూ.1300 కాదు రూ.1500 ఇవ్వాలి
- కౌలు రైతుల కులం గురించి జగన్ ఎందుకు అడుగుతున్నారు?
రైతులకు న్యాయం జరగాలని కోరుకుంటున్నానని, వారి ప్రతినిధిగా మాట్లాడుతున్నాను కనుక ప్రభుత్వం దగ్గర తగ్గే మాట్లాడాలని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కాకినాడలో రైతు సౌభాగ్య దీక్ష ముగిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, సీఎం జగన్ ఇంటి మరమ్మతుల కోసం రూ.9 కోట్ల బిల్లు పెట్టారు కానీ, రైతుల దగ్గర కొనుగోలు చేసిన ధాన్యానికి మాత్రం రశీదులు ఇవ్వలేదని, ఇంత వరకూ డబ్బులు చెల్లించలేదని విమర్శించారు.
వైసీపీ ప్రభుత్వాన్ని మర్యాదగా అడుగుతున్నానని, అసెంబ్లీలో రైతు సమస్యలపై చర్చించాలని పవన్ డిమాండ్ చేశారు. ధాన్యపు బస్తాకు రూ.1300 కాకుండా రూ.1500 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చేసిన ఆలస్యానికి, తప్పుకు రైతులకు క్షమాపణ చెప్పినట్టు ఉంటుందని అన్నారు. మానవత్వం తన మతం అని, మాట తప్పకపోవడం తన కులం అని చెబుతున్న జగన్, కౌలు రైతుల కులం గురించి ఎందుకు అడుగుతున్నారని ప్రశ్నించారు.