Bangladesh foreign minister AK.Momen: వాళ్లలో వాళ్లనే పోట్లాడుకోనిద్దాం... భారత్ లోని పరిస్థితులపై బంగ్లాదేశ్ విదేశాంగ శాఖమంత్రి వ్యాఖ్య
- భారత్ లో వెల్లువెత్తుతున్న నిరసనల నేపథ్యంలో ప్రకటన
- భారత్ పర్యటన రద్దు చేసుకున్న బంగ్లా మంత్రి
- ఇరుదేశాల మైత్రికి భంగం కలిగదనిభావిస్తున్నామన్న మంత్రి
పౌరసత్వ సవరణ బిల్లుపై దేశంలోని ఈశాన్య ప్రాంతాల్లో చెలరేగుతున్న అల్లర్ల నేపథ్యంలో రేపటినుంచి భారత్ లో పర్యటించాల్సిన బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఏకే.అబ్దుల్ మోమిన్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. ఆయన ఈ నెల 12 నుంచి 14వ తేదీవరకు మనదేశంలో పర్యటించాల్సి ఉంది. పర్యటనలో భాగంగా ఇండియన్ ఓసియన్ డైలాగ్, ఢిల్లీ డైలాగ్ ఈవెంట్లలో పాల్గొనాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో మోమిన్ మాట్లాడుతూ, ’భారతీయులు దేశీయంగా పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాళ్లలో వాళ్లనే పోట్లాడుకోనిద్దాం. వాటితో మాకు సమస్య లేదు. ఇరుదేశాల మధ్య ఉన్న సుహృద్భావ సంబంధాలను ప్రభావితం చేసే చర్యలకు భారత్ దిగదని ఒక మిత్రదేశంగా మేము ఆశిస్తున్నాము’ అని పేర్కొన్నట్టు బంగ్లాదేశ్ మీడియా పేర్కొంది.
పౌరసత్వ సవరణ బిల్లు(సీఏబీ) పార్లమెంటులో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఇక ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే.. ముస్లిం మెజారిటీ దేశాలైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ లోని మైనారిటీలు మత పరమైన పీడనకు గురై భారత్ లోకి శరణార్థులుగా వస్తే.. ఇక్కడ వారికి పౌరసత్వం పొందడానికి వీలవుతుంది. అలాంటి శరణార్థులపై విచారణ జరిపిన అనంతరమే పౌరసత్వం కల్పిస్తారు.