Onion: గోవా ఎప్పుడైనా చూడొచ్చు...ఇప్పటికైతే ఉల్లిపాయలే కావాలి: 'అభి బస్' ప్రయాణికుల మనోగతం ఇది

  • అభి బస్ సర్వీస్ ఆఫర్లలో ఆనియన్ కి విపరీతమైన డిమాండ్ 
  • 56 శాతం మంది కోరుకున్నది ఉల్లిపాయలే 
  • ఆశ్చర్యపోయిన సంస్థ నిర్వాహకులు

దేశవ్యాప్తంగా ఇప్పుడు ఉల్లిపాయలు హాట్ టాపిక్. ధర చుక్కల నంటడమే ఇందుకు కారణం! వర్షాలు, వరదల పుణ్యాన ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఉల్లి ధర రూ.200 మార్కు చూసేసింది. కొన్ని రాష్ట్రాల్లో అంతకంటే ఎక్కువ ధర పలికింది. ఈ నేపథ్యంలో ఓ ఆన్ లైన్ బస్సు సర్వీస్ సంస్థ సరదాగా పెట్టిన ఆఫర్లలో ఎక్కువ మంది ఉల్లిపాయలను ఎంచుకోవడంతో సంస్థ సిబ్బంది అవాక్కయ్యారు.

ఇంతకీ విషయం ఏమిటంటే... 'అభి బస్.కామ్' గోవా కేంద్రంగా ఆన్ లైన్ బస్సు సర్వీసులను నిర్వహిస్తోంది. ఈ సంస్థ ఉల్లి ధరల కారణంగా సామాజిక మాధ్యమాల్లో వస్తున్న జోక్స్, మీమ్స్ చూసి తమ ప్రయాణికులకు ఉల్లిపాయలు గెల్చుకునే పోటీ నిర్వహించాలని భావించింది. ఇందుకోసం ఓ ప్రకటన ఉంచింది.

డిసెంబర 10 నుంచి 15వ తేదీ వరకు ఎవరైతే తమ సంస్థలో టికెట్ బుక్ చేసుకుంటారో వారికి కొన్ని ఆఫర్లు ఇస్తున్నాం' అన్నది ఆ ప్రకటన సారాంశం. అలా ఇచ్చిన ఆఫర్లలో గోవా ట్రిప్, ఐఫోన్, ఈ-బైక్ తోపాటు మూడు కేజీల ఉల్లిపాయలను కూడా ప్రకటించింది. ఇందులో ఏదో ఒకదాన్ని ప్రయాణికులు ఎంచుకోవచ్చు.

ఆశ్చర్యంగా టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికుల్లో 56 శాతం మంది ఉల్లిపాయలను ఎంచుకోవడం సంస్థ ప్రతినిధులను ఆశ్చర్యపరిచింది. 'మా ప్రయాణికులు ఉల్లిపాయల కోసం గోవా పర్యటనను కూడా కాదనుకున్నారు' అంటూ సంస్థ తన అధికారిక వెబ్ సైట్లో ఉంచింది. ప్రస్తుతం అభి బస్ సంస్థ తన ప్రయాణికుల్లో ప్రతిరోజూ 20 మందిని ఎంపిక చేసి మూడు కేజీలు చొప్పున ఉల్లిపాయలు అందజేస్తోంది. 

  • Loading...

More Telugu News