Assam: అసోం సీఎం, కేంద్ర మంత్రి నివాసాలపై ఆందోళనకారుల దాడి.. ఆస్తుల ధ్వంసం
- పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా అసోంలో ఆందోళనలు
- బీజేపీ నేతల నివాసాలపై దాడి
- రాష్ట్రంలో భారీగా మోహరించిన భద్రతా బలగాలు
పౌరసత్వ సవరణ బిల్లును నిరసిస్తూ అసోంలో ఆందోళనలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. డులియాజన్ లో ఉన్న కేంద్ర మంత్రి రామేశ్వర్ తేలి నివాసంపై నిరసనకారులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇంట్లోని ఆస్తులు ధ్వంసమయ్యాయి. దిబ్రుగఢ్ నియోజకవర్గం నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న తేలి... కేంద్ర ఆహార తయారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా పని చేస్తున్నారు.
తేలి నివాసంపై దాడి జరగక ముందే ముఖ్యమంత్రి శర్వానంద సోనోవాల్ నివాసంపై కూడా ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. బీజేపీ ఎమ్మెల్యే ప్రశాంత ఫుకాన్, ఆ పార్టీ నేత సుభాష్ దత్తా నివాసాలపై కూడా దాడికి తెగబడ్డారు. మరోవైపు, ఆందోళనలతో అట్టుడుకుతున్న అసోంలో భారీ ఎత్తున భద్రతా బలగాలను మోహరింపజేశారు. ఈ బిల్లుకు సోమవారం లోక్ సభలో, నిన్న రాజ్యసభలో ఆమోదముద్ర పడిన సంగతి తెలిసిందే.