Marriage: మాయదారి రోగం వచ్చిందని నాటకం ఆడి పెళ్లిని తప్పించుకున్న వరుడు... కటకటాల పాలు!
- డిసెంబర్ 1న జరగాల్సిన పెళ్లి
- తనకు ఎయిడ్స్ సోకిందని అబద్ధమాడిన వరుడు
- ఆపై పోలీసులను ఆశ్రయించిన వధువు కుటుంబీకులు
- అవాస్తవమని తేలడంతో అరెస్ట్
మరో నాలుగు రోజుల్లో వివాహం. ఆడ పెళ్లివారు ఏర్పాట్లు చేసేసుకున్నారు. అప్పటికే దాదాపు రూ. 15 లక్షలు ఖర్చు పెట్టారు. ఆ సమయంలో వారంతా దిగ్భ్రాంతికి గురయ్యే వార్త తెలిసింది. తాము ఎంచుకున్న వరుడికి హెచ్ఐవీ సోకిందన్న వార్తను విన్న వారు హతాశులయ్యారు. చేసేదేమీ లేక వివాహాన్ని రద్దు చేసుకున్నారు. ఆ సమయంలో పెళ్లి కుమారుడి వ్యవహారంపై అనుమానం వచ్చిన ఆడపిల్ల తరఫు వారు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం బయటపడింది. పెళ్లి ఇష్టం లేని వరుడు ఇలా దొంగ నాటకం ఆడాడని తేలింది.
ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. విజయనగర పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, ఈ నెల 1వ తేదీన కిరణ్ కు ఓ యువతితో వివాహం నిశ్చయమైంది. గత చివరి వారంలో అతను వధువు ఇంటికి వచ్చి, తనకు ఎయిడ్స్ సోకిందని చెప్పాడు. వైద్య పరీక్షల పత్రాలు చూపించి బోరుమన్నాడు. ఆపై పెళ్లిని రద్దు చేసుకున్న తరువాత విజయనగర పోలీసులను వధువు కుటుంబీకులు ఆశ్రయించారు. వారు కిరణ్ ను మరోసారి హాస్పిటల్ కు తీసుకెళ్లి పరీక్షలు చేయించగా, ఎటువంటి మాయదారి రోగమూ లేదని తేలింది. దీంతో మోసం చేశాడన్న ఆరోపణలపై కిరణ్ ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.