New Delhi: కాలుష్యం వల్ల ఢిల్లీ పర్యటన అంటేనే హడలిపోయే పరిస్థితులు తలెత్తాయి: ఏపీ గవర్నర్
- విజయవాడలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమం
- హాజరైన బిశ్వభూషణ్ హరిచందన్
- భూమి ఆపదలో ఉందన్న గవర్నర్
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ విజయవాడ లయోలా కాలేజీలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చేపడుతున్న లక్ష మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం భూమి ఆపదలో ఉందని అన్నారు. భూమాత హరిత వనాలతో విలసిల్లినప్పుడే జీవరాశికి మనుగడ సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. ఇది ప్రపంచం మొత్తానికి వర్తిస్తుందని తెలిపారు. ముఖ్యంగా మనదేశంలో రాజధాని ఢిల్లీ కాలుష్యానికి మరోపేరులా నిలుస్తోందని, గత కొన్నినెలలుగా ఢిల్లీ పర్యటన అంటేనే హడలిపోయే పరిస్థితి వచ్చిందని అన్నారు. ఢిల్లీలో వాతావరణ కాలుష్యం ప్రమాదకరంగా ఉందని, ప్రజల ఆరోగ్యానికి ముప్పు కలగకముందే చర్యలు తీసుకోవాలని సూచించారు.