cm: కోహ్లీతో జగన్ ని, కపిల్ దేవ్ తో చంద్రబాబుని పోలుస్తూ వైసీపీ ఎమ్మెల్యే సెటైర్లు

  • ఉత్తరాంధ్రలోని ఓ సామెత చెప్పిన ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్
  • కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నాడు కనుక కపిల్ బౌలింగ్ చేస్తానంటే కుదరదు
  • కపిల్ దేవ్ ఇప్పుడు కామెంట్రీ చెప్పడానికి పనికొస్తారు  

ఏపీలో గ్రామసచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామస్వరాజ్యాన్ని తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్న సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలుపుతున్నానని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్  అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈరోజు ఆయన మాట్లాడుతూ, జగన్ పాదయాత్ర చేసిన సమయంలో ప్రతి గ్రామంలోను ప్రజలు పడుతున్న కష్టాలు, వారి ఇబ్బందులను ఆయన తెలుసుకున్నారని అన్నారు.

మారుమూల గ్రామాల్లోని వ్యక్తులు తమ సమస్యలను ప్రభుత్వానికి చెప్పుకునే అవకాశం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం ఉన్నట్లని అన్నారు. ప్రజల సమస్యలు తీర్చేవే గ్రామ సచివాలయాలు అని, 14 శాఖల అధికారులు గ్రామస్తులకు అందుబాటులో ఉంటారని అన్నారు. సచివాలయ వ్యవస్థకు ప్రతిపక్ష సభ్యులు అనుకూలమా? వ్యతిరేకమా? అనే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని అన్నారు. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో నిరుద్యోగులకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో లెక్క చెప్పాలని టీడీపీ సభ్యులను ప్రశ్నించారు. ప్రతిపక్షానికి అనుకూలంగా ఉన్న పత్రికలు రాస్తున్న కథనాల్లో వాస్తవాలు లేవని విమర్శించారు.

‘చలి చీమలకు రెక్కలొచ్చినా.. ముసలి వాడికి పిచ్చొచ్చినా ఎక్కువ కాలం  నిలబడవు’ అని ఉత్తరాంధ్రలో ఓ సామెత ఉందంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై ఆయన విమర్శలు చేశారు. నేను ఎవరిని అయినా ఎదుర్కోగలను అంటూ చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన సెటైర్లు విసిరారు.

1983లో భారత్ కు వరల్డ్ కప్ సాధించిన  కపిల్ దేవ్, ఇప్పుడు కామెంట్రీ చేయడానికి పనికొస్తారు కానీ, ఆడేందుకు పనికిరారంటూ చంద్రబాబుపై పరోక్ష విమర్శలు చేశారు. సీఎం జగన్ ని విరాట్ కోహ్లీతో, చంద్రబాబునాయుడిని కపిల్ దేవ్ తో పోలుస్తూ బాబుపై విమర్శలు చేశారు. కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నాడు కనుక కపిల్ దేవ్ బౌలింగ్ చేస్తానంటే కుదరదంటూ చంద్రబాబుపై  సెటైర్లు వేశారు.

  • Loading...

More Telugu News