AP Assembly Updates: రైతులకు గత ప్రభుత్వం ఒరగబెట్టిందేమీ లేదు: వైసీపీ ఎమ్మెల్యేలు
- చంద్రబాబు రుణ మాఫీ హామీ కాగితాలకే పరిమితమైంది
- నీరు-చెట్టు పథకం పేరుతో టీడీపీ నేతలు అవినీతికి పాల్పడ్డారు
- మా ప్రభుత్వం రైతుల శ్రేయస్సే లక్ష్యంగా ముందుకు సాగుతోంది
రాష్ట్రంలో రైతులకు గత టీడీపీ ప్రభుత్వం ఒరగబెట్టిందేమీ లేదని వైసీపీ ఎమ్మెల్యేలు రఘురామరెడ్డి, కరణం ధర్మశ్రీలు వ్యాఖ్యానించారు. ఏపీ శాసన సభ శీతాకాల సమావేశాల్లో రెండో రోజు అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాద ప్రతివాదనలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు రుణ మాఫీ హామీ కాగితాలకే పరిమితమైందని రఘురామరెడ్డి విమర్శించారు. నీరు-చెట్టు పథకం పేరుతో టీడీపీ నేతలు వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. రైతులను నమ్మించి నట్టేట ముంచారని ధ్వజమెత్తారు.
అధికార పార్టీకే చెందిన ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కూడా ఇదే రీతిలో టీడీపీని విమర్శించారు. చంద్రబాబు రుణమాఫీ ఇచ్చి రైతులకు టోపీ పెట్టారని మండిపడ్డారు. మాఫీ మాట అటుంచి, రైతులకు బీపీ పెంచారని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం రైతుల శ్రేయస్సే లక్ష్యంగా ముందుకు సాగుతుందన్నారు. సీఎం జగన్ కౌలు రైతులకోసం చట్టం తెచ్చారన్నారు. రైతు భరోసా పథకం ప్రవేశపెట్టి రైతులకు అండగా నిలిచారని తెలిపారు.