Jio Plan: జియో పాత ప్లాన్లు రూ.98, రూ.149 పునరుద్ధరణ
- స్వల్ప మార్పులతో సరికొత్తగా అమలు
- తాజా నిర్ణయంతో ఎయిర్ టెల్, వోడాఫోన్ లకు చెక్
- రూ.98 ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీ కాగా, రూ.149 ప్లాన్ 24 రోజులకే పరిమితం
ఇటీవల తాను అందిస్తున్న ప్లాన్లను సవరించిన ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో, తాజాగా తొలగించిన పాత ప్లాన్లను పునరుద్ధరించినట్లు ప్రకటన జారీ చేసింది. ఇటీవల ఇతర నెట్ వర్క్ లకు చేసే కాల్స్ పై ఉన్న పరిమితిని ఎయిర్ టెల్, వోడాఫోన్ ఎత్తివేసిన నేపథ్యంలో జియో తాజాగా పాత ప్లాన్లను పునరుద్ధరిస్తూ ప్రకటన జారీచేసింది.
తొలగించిన రూ.98, రూ.149 ప్లాన్లను కంపెనీ మళ్లీ ప్రారంభించింది. రూ.98 ప్లాన్ కింద 2 జీబీ హైస్పీడ్ డేటా, 300 ఎస్ఎంఎస్ లు జియో యాప్స్ లను ఉపయోగించుకునే వీలుంటుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుంటుంది. జియో నుంచి జియోకు ఉచిత కాల్స్ , ఇతర నెట్ వర్క్ లకు చేసే కాల్స్ కు నిమిషానికి ఆరు పైసలు చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. నిర్ణీత డేటా పూర్తయ్యాక డేటా వేగం 64 కేబీపీఎస్ కు తగ్గుతుంది.
జియో ప్రీ పెయిడ్ లో అత్యంత ఆదరణ పొందిన రూ.149 ప్లాన్ కింద రోజుకు 1 జిబీ హై స్పీడ్ డేటా లభించనుంది, గతంలో ఈ ప్లాన్ కింద రోజుకు 1.5 జీబీ డేటా లభించేది. కాగా, జియో నుంచి జియోకు ఉచిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు, ఇతర నెట్ వర్క్ లకు చేసే కాల్స్ కోసం 300 నిమిషాలు ఉచితంగా అందించనున్నారు. కాగా ఈ ప్లాన్ వ్యాలిడిటీ 24 రోజులుగా ఉండనుంది. గతంలో ఈ ప్లాన్ గడువు 28 రోజులుగా ఉంది.