shad nagar encounter: కడపటి చూపుకు నోచుకోనివ్వండి: ఎన్ కౌంటర్ బాధిత కుటుంబాల వేడుకోలు
- శుక్రవారం వరకూ గాంధీ హాస్పటల్ లోనే మృతదేహాలు
- ఓవైపు ఎన్.హెచ్.ఆర్.సి, మరోవైపు హైకోర్టు విచారణ
- విచారణ గురువారానికి వాయిదా వేసిన హైకోర్టు
దిశ అత్యాచార, హత్య ఘటనలో నిందితులు పోలీస్ ఎన్ కౌంటర్ లో చనిపోయిన సంగతి తెలిసింది. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ సంచలన ఎన్ కౌంటర్ విషయంలో అనేక సందేహాలు, అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. దీనిపై జాతీయ మానవ హక్కుల సంఘం విచారణ జరుపుతోంది. మరోవైపు తెలంగాణ హైకోర్టు కూడా విచారణ కొనసాగిస్తోంది. గురువారం ఈ కేసు విచారణ ఉన్నందున ఇప్పటికే పోస్ట్ మార్టం పూర్తయిన నిందితుల మృత దేహాలను శుక్రవారం వరకూ గాంధీ హాస్పటల్ లోనే భద్రపరచాలని హైకోర్టు ఆదేశించింది.
ఇదిలా ఉంటే, మృతుల కుటుంబ సభ్యులు తమ వారి మృత దేహాల కడపటి చూపుకు నోచుకోనివ్వండి అంటూ అధికారులను, ఇటు మీడియాను వేడుకుంటున్నారు. ఎన్ కౌంటర్ జరిగిన నాటి నుండి తమ వారి డెడ్ బాడీలను చూడనివ్వడం లేదని, పోస్టుమార్టం పూర్తయిన బాడీలను ఇంకా అప్పగించక పోతే ఎలా అంటూ కన్నీటి పర్యంతం అవుతున్నారు. నిందితుల్లో ఒకడైన చెన్నకేశవులు తండ్రి రాజయ్య సోమవారం మీడియాతో తమకు అండగా ఎవరూ రాని కారణంగానే అధికారులు ఇలా వ్యవహరిస్తున్నారని తన ఆవేదన వ్యక్తం చేశారు.