Hanging Rope: వారం రోజుల్లో 10 ఉరితాళ్లు సిద్ధం చేయాలంటూ బక్సర్ జైలుకు సందేశం!
- నిర్భయ నిందితులకు త్వరలో ఉరి!
- ఉరితాళ్ల తయారీకి పేరుగాంచిన బక్సర్ జైలు
- జైళ్ల డైరెక్టరేట్ నుంచి బక్సర్ జైలుకు సందేశం
నిర్భయ నిందితులకు ఈ నెల 16న ఉరిశిక్ష అమలు చేయాలని కేంద్రం నిర్ణయించినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీహార్ లోని బక్సర్ జైలుకు ఓ సందేశం వచ్చింది. డిసెంబరు 14 నాటికి 10 ఉరితాళ్లను సిద్ధం చేయాలన్నది ఆ సందేశంలోని సారాంశం. ఉరితాళ్లను రూపొందించడంలో బక్సర్ జైలుకు ఎంతో పేరుంది. పార్లమెంటు దాడుల సూత్రధారి అఫ్జల్ గురును ఉరితీసేందుకు ఉపయోగించిన తాడును కూడా ఈ జైల్లోనే తయారుచేశారు.
తాజాగా, మరోసారి ఉరితాళ్లు పంపించాలని జైళ్ల డైరెక్టరేట్ నుంచి వచ్చిన సందేశం ద్వారా ఆ ఉరితాళ్లు నిర్భయ నిందితుల కోసమేననని భావిస్తున్నారు. దీనిపై బక్సర్ జైలు సూపరింటిండెంట్ విజయ్ కుమార్ అరోరా మాట్లాడుతూ, ఉరితాళ్లు తయారుచేయాలంటూ సూచనలు వచ్చింది నిజమేనని, వాటిని ఎవరి కోసం ఉపయోగిస్తారన్నది తమకు తెలియదని స్పష్టం చేశారు.