tree: మొక్కను ఢీకొట్టిన టాటా సుమో.. కారు యజమానికి రూ.9,500 జరిమానా విధించిన అధికారి
- సిద్దిపేట పట్టణంలో ఘటన
- కారు ఢీ కొట్టడంతో పడిపోయిన హరితహారం మొక్క
- మొక్కలకు హాని కలిగిస్తే జరిమానా తప్పదంటోన్న అధికారులు
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారంలో భాగంగా నాటిన మొక్కల పరిరక్షణకు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మొక్కలు, చెట్లను నరికేసిన వారికి జరిమానాలు విధిస్తున్నారు. ఈ క్రమంలో సిద్దిపేట పట్టణంలోని వైద్య కళాశాల వద్ద ఓ మొక్కను టాటా సుమో వాహనం ఢీ కొట్టడంతో ఆ మొక్క పడిపోయింది. దీంతో ఆ కారు యజమాని రాకేశ్ కు హరితహారం అధికారి సామల్ల ఐలయ్య తొమ్మిది వేల ఐదు వందల రూపాయల జరిమానా విధించారు.
మొక్కలకు హాని కలిగిస్తే తప్పకుండా జరిమానా చెల్లించాల్సిందేనని అన్నారు. మొక్కల సంరక్షణ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తోన్న ఐలయ్యకు అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలోని పలు చోట్ల మొక్కలను పీకేసిన వారికి జరిమానాలు విధిస్తోన్న విషయం తెలిసిందే.