Onions: గుడివాడలో ఉల్లి కోసం క్యూలో నిల్చుని ప్రాణాలు కోల్పోయిన వృద్ధుడు!

  • గంటల కొద్దీ నిల్చోవడంతో అస్వస్థత
  • స్పృహతప్పి పడిపోవడంతో ఆసుపత్రికి తరలించిన స్థానికులు
  • గుండెపోటుతో మృతిచెందినట్లు ప్రకటించిన వైద్యులు

గుడివాడలో విషాదం చోటు చేసుకుంది. ఉల్లి కోసం క్యూలో నిల్చున్న ఓ వృద్ధుడు టెన్షన్‌ తట్టుకోలేక గుండెపోటుకు గురై మృతి చెందాడు. ఉల్లి ధర ఆకాశాన్నంటడంతో ఏపీ ప్రభుత్వం రైతు బజార్ల ద్వారా సబ్సిడీ ఉల్లి పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. కృష్ణా జిల్లా గుడివాడ రైతు బజార్‌లో ఈరోజు ఉదయం ఉల్లి అమ్మకాలు జరుగుతుండడంతో సాంబయ్య అనే వృద్ధుడు క్యూలో నిల్చున్నాడు. ఉదయం నుంచి క్యూలో నిల్చోవడం, ఉల్లి దొరుకుతుందో లేదో అన్న టెన్షన్‌కు గురికావడంతో కొన్ని గంటల తర్వాత క్యూలోనే కుప్పకూలిపోయాడు. స్పృహతప్పి పడిపోయిన అతన్ని హుటాహుటిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

Onions
one dead
Krishna District
gudivada
  • Loading...

More Telugu News