hotel: హోటల్ నుంచి వార్తాపత్రికలో పార్సిల్ తీసుకెళ్తున్నారా?.. జాగ్రత్త అంటోన్న అధికారులు
- భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ అధికారుల హెచ్చరిక
- వార్తాపత్రికల సిరా రంగుల్లో కేన్సర్ కారకాలు
- వినియోగదారుడికి కేన్సర్ వచ్చే ప్రమాదం
- రోగనిరోధక శక్తి తగ్గుదల
ఆహార పదార్థాలను ఇంటికి పార్సిల్ ప్యాక్ చేసి ఇవ్వాలంటే హోటల్ లోని సిబ్బంది వార్తాపత్రికలను బాగా వాడతారు. వార్తాపత్రికల్లో ఆహారపదార్థాలను ఉంచి ప్యాక్ చేసి, దాన్ని ఓ కవర్ లో పెట్టి ఇస్తారు. ప్లాస్టిక్ పై నిషేధం విధిస్తోన్న నేపథ్యంలో పార్సిల్ కోసం వార్తాపత్రికలను మరింత అధికంగా వాడుతున్నారు. అయితే, ఇది చాలా ప్రమాదకరమని భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ అధికారులు సూచించారు.
వార్తాపత్రికల సిరా రంగుల్లో కేన్సర్ కారకాలు ఉంటాయని, వాటిల్లో ఆహారపదార్థాలను తీసుకెళ్లడం వల్ల వినియోగదారుడికి కేన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ఆ సంస్థ అధికారులు చెప్పారు. అంతేగాక, వార్తా పత్రికల్లో ఆహారం తింటే పిల్లలు, వృద్ధుల్లో రోగనిరోధక శక్తి తగ్గుతుందని, ఈ రసాయనాలు జీర్ణక్రియపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని తెలిపారు.