Maharashtra: అజిత్ పవార్ వ్యవహారం శరద్ పవార్‌కు తెలుసు : ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు
- బీజేపీతో కలిసేందుకు వారంతా సిద్ధమయ్యారు
- ఆ తర్వాత ఎందుకో మాటమార్చారు
- ప్రధానితో భేటీ అనంతరం చాలా విషయాలు శరద్ దాచారు
మహారాష్ట్రలో ఎన్సీపీ, కాంగ్రెస్ మద్దతుతో శివసేన ఆధ్వర్యంలో ‘మహా వికాస్ అఘాడీ’ ప్రభుత్వం ఏర్పడింది. ఉద్ధవ్ థాకరే ముఖ్యమంత్రి అయ్యారు. ఇక వివాదం సమసిపోయినట్టే అనుకుంటే తాజాగా ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమతో ఎన్సీపీ నాయకుడు అజిత్‌పవార్ కలవడం శరద్‌పవార్‌కి తెలిసే జరిగిందని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ఎందుకో శరద్‌పవార్ మాటమార్చారని వ్యాఖ్యానించారు.
‘మేమేమీ అజిత్ పవార్‌తో సంప్రదించలేదు. ఏ పార్టీలోనూ చీలికలు తేవాలని ప్రయత్నించలేదు. బీజేపీతో కలిసి నడిచేందుకు ఎన్సీపీ సిద్ధంగా ఉందని అజిత్ పవారే మమ్మల్ని సంప్రదించారు. నాతో కొంతమంది ఎమ్మెల్యేలతో మాట్లాడించారు కూడా. శరద్ పవార్‌కి ఈ విషయం తెలుసు’ అన్నారు.
ప్రభుత్వం ఏర్పాటు విషయంలో తీవ్ర సంక్షోభం నెలకొన్న సమయంలో ప్రధాని మోదీతో శరద్‌పవార్ భేటీ కీలకమేనని ఫడ్నవీస్ చెప్పారు. ఎన్నో అంశాలు, శరద్ పవార్ ఆకాంక్షలు చర్చకు వచ్చినా బయటకు వచ్చిన తర్వాత శరద్ తనకు అనుకూలమైన అంశాలు మాత్రమే... అంటే ‘ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని ప్రధాని కోరారని, తాను తిరస్కరించానని’ మీడియాకు వెల్లడించారు తప్ప ఇతర అంశాలు మాత్రం దాచిపెట్టారని చెప్పారు. ఈ అంశాలను త్వరలోనే అవసరమైనప్పుడు బయటపెడతామని ఫడ్నవీస్ తెలిపారు.