onion: ఉల్లి ధరల పెరుగుదలపై కాంగ్రెస్ వినూత్న నిరసన.. కిలో కోడి ఇచ్చి కిలో ఉల్లిగడ్డల కొనుగోలు
- తెలంగాణలోని కోరుట్లలో ఘటన
- ఉల్లిధరల పెరుగుదలకు నిరసనగా జాతీయ రహదారిపై రాస్తారోకో
- ఉల్లిధరల నియంత్రణలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపణ
ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్న ఉల్లి ధరలను నియంత్రించాలని కోరుతూ తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోరుట్లలో కాంగ్రెస్ వినూత్న నిరసన చేపట్టింది. మెడలో ఉల్లిగడ్డల దండలు వేసుకుని జాతీయ రహదారిపై రాస్తారోకోకు దిగారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నేత జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ.. రాయితీపై రాష్ట్ర ప్రభుత్వం ఉల్లిగడ్డలు విక్రయించాలని డిమాండ్ చేశారు.
ఉల్లి ధరలను అదుపు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయన్నారు. కిలో ఉల్లిగడ్డల రేటుకు కిలో కోడి వస్తోందన్నారు. ఈ సందర్భంగా కోడిని ఇచ్చి ఉల్లిపాయలు కొనుగోలు చేసి నిరసన తెలిపారు. అనంతరం ధరలను తగ్గించాలని కోరుతూ తహసీల్దార్ సత్యనారాయణకు వినతిపత్రం అందించారు.