Chennai: ప్రజలు నన్ను నమ్మారు... ఆ నమ్మకాన్ని వమ్ము కానివ్వను: రజనీకాంత్
- చెన్నైలో 'దర్బార్' పాటల పండగ
- ప్రజల్లో ప్రతికూల ధోరణి పెరిగింది
- సానుకూలత అలవరచుకోవాలన్న రజనీ
తమిళనాడు ప్రజలు తనను నమ్మారని, వారు తనపై ఉంచిన నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వమ్ము కానివ్వబోనని సూపర్ స్టార్ రజనీకాంత్ వ్యాఖ్యానించారు. శనివారం రాత్రి చెన్నైలో తన కొత్త చిత్రం 'దర్బార్' పాటల విడుదల సందర్భంగా రజనీ మాట్లాడారు. చిన్నప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు. ఎస్సెస్సెల్సీ చదువుతున్న రోజుల్లో పరీక్ష ఫీజు కోసం రూ. 150 ఇస్తే, తాను ఫెయిలవుతానన్న ఉద్దేశంతో మద్రాస్ కు రైలు ఎక్కానని, తన టికెట్ ఎక్కడో జారి పడిపోతే, ఆ విషయం టికెట్ ఇన్ స్పెక్టర్ కు చెప్పానని, ఆయన అది నమ్మారని, తెలియని వ్యక్తి తనను నమ్మడం అదే తొలిసారని రజనీ వ్యాఖ్యానించారు.
ఆపై మద్రాసులో బాలచందర్ తనను విశ్వసించారని, ఆయన పెట్టుకున్న నమ్మకాన్ని గెలిపించానని అన్నారు. ఇప్పుడు తమిళ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్నీ గెలిపిస్తానని అన్నారు. నేటి తరంలో అందరూ ప్రతికూల ధోరణితో ఆలోచిస్తున్నారని, మీడియా కూడా అలాగే ఉందని అభిప్రాయపడ్డ రజనీ, సానుకూల దృక్పథాన్ని అలవరచుకోవాలని కోరారు. 'దర్బార్' సినిమా కథ తన వద్దకు 'శివాజీ' షూటింగ్ సమయంలోనే వచ్చిందని, మురుగదాస్ ఈ స్టోరీని ఎంతో చక్కగా తెరకెక్కించారని అన్నారు. 'దళపతి' సినిమా తీసిన 29 సంవత్సరాల తరువాత తిరిగి సంతోష్ శివన్ తన చిత్రానికి పని చేశారని చెప్పారు.
ఇదే ఫంక్షన్ లో మురుగదాస్ మాట్లాడుతూ, తాను ఈ సినిమాలోని ప్రతి సన్నివేశాన్నీ రజనీని దృష్టిలో ఉంచుకునే రాశానని, ఆయన్ను దర్శకత్వం చేయడమంటే, తనకు చంద్రమండలానికి వెళ్లినంత సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు శంకర్, సంగీత దర్శకుడు అనిరుధ్, రజనీ కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్య, అరుణ్ విజయ్ తదితరులు పాల్గొన్నారు.