court justice: న్యాయప్రక్రియ ఖర్చుతో కూడింది.. సామాన్యుడికి అందకుండా పోతోంది: రాష్ట్రపతి
- రాజ్యాంగంలో ప్రతి వ్యక్తికి న్యాయం అందించాలి అనే అంశం ఉంది
- ఒక పేదవాడు న్యాయంకోసం ఇక్కడికి వస్తున్నాడా?
- గాంధీ ఆలోచన విధానం అమలు లక్ష్యంగా సాగాలి
దేశంలోని న్యాయప్రక్రియపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయ సేవ సాధారణ పౌరుడికి అందని పండులా మారిందని ఆయన అన్నారు. ఈ రోజు రాజస్థాన్ లో నూతన హైకోర్టు భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. న్యాయ ప్రక్రియ చాలా కారణాల వల్ల సాధారణ పౌరుడికి అందకుండా పోతోందన్నారు. అంతేకాక, ఈ ప్రక్రియ ఖర్చుతో కూడుకున్నదిగా మారిందన్నారు. సాధారణ న్యాయవాదులకు ఉన్నత న్యాయస్థానాలు అసాధ్యమైన రీతిలో ఉన్నాయన్నారు. ఒక పేదవాడు న్యాయంకోసం ఇక్కడికి వస్తున్నాడా ? అనేది ముఖ్యమైన ప్రశ్న అని పేర్కొన్నారు.
మన రాజ్యాంగంలో ప్రతి వ్యక్తికి న్యాయం అందించాలి అనే అంశాన్ని మనం అందరం సమష్టిగా ఒప్పుకున్నామని చెప్పారు. న్యాయ సేవలు అందుకోవడంపై ఖర్చుల విషయమై మహాత్మా గాంధీ అప్పట్లోనే ఆందోళన వ్యక్తం చేశారన్నారు. గాంధీ ఆలోచన విధానాన్ని అమలు లక్ష్యంగా సాగితే మనం సరైన మార్గంలో ముందుకెళతామన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ న్యాయవాది అశోక్ సేన్ పేరును ప్రస్తావిస్తూ.. ఆయన అందరికీ న్యాయం అందించడానికి కట్టుబడి పలు పదవులను చేపట్టారన్నారు. అపెక్స్ కోర్టు 9 ప్రాంతీయ భాషల్లో తీర్పును వెలువరించడంపై రాష్ట్రపతి హర్షం వ్యక్తం చేశారు.