Telangana: మూసీ నది ప్రక్షాళనకు ఉద్యమిస్తాం: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్

  • మూసీని సబర్మతి నదిలా మార్చుతామని కేటీఆర్ అన్నారు
  • హుస్సేన్ సాగర్ ప్రక్షాళన మాటలకే పరిమితమయింది
  • ప్రభుత్వ తీరు మారకుంటే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లకు అదే గతి

కాలుష్య కాసారంగా మారిన మూసీ నది ప్రక్షాళనను తెలంగాణ ప్రభుత్వం గాలికి వదలివేసిందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ధ్వజమెత్తారు. ఈ రోజు హైదరాబాద్ లో మూసీ నది ప్రక్షాళనపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సమావేశంలో లక్ష్మణ్ తో పాటు పలు పార్టీల నేతలు, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు.

హైదరాబాద్ నగరం నడి బొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ ను కాలుష్యం నుంచి విముక్తి చేస్తామని గతంలో కేటీఆర్ ప్రగల్భాలు పలికారని విమర్శించారు. హుస్సేన్ సాగర్ సంగతి దేవుడికే తెలియాలి... ముందుగా మూసీ నది సంగతి చూడండని లక్ష్మణ్ కోరారు. మూసీ నదిని సబర్మతి నదిలా మార్చుతామని కేటీఆర్ గుజరాత్ పర్యటన చేసినప్పుడు చెప్పారని ఆయన గుర్తు చేశారు.

ప్రభుత్వ నిర్లక్ష్యం ఇదే రీతిలో కొనసాగితే.. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లు కూడా క్రమంగా కాలగతిలో కలిసిపోతాయని పేర్కొన్నారు. పారిశ్రామిక వ్యర్థాలు మూసీలో కలవకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మూసీని కాపాడటంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు విఫలమైందని చెప్పారు. మూసీ నది ప్రక్షాళనకోసం బీజేపీ ఉద్యమిస్తుందన్నారు. మూసీ నది ప్రక్షాళనకు రూ.300 కోట్లు కేటాయించిన ప్రభుత్వం కేవలం రూ.3 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని లక్ష్మణ్  ఎత్తిచూపారు.

  • Loading...

More Telugu News