Justice for disa: ఎన్ కౌంటర్ పై ఎన్ హెచ్ఆర్ సీ దర్యాప్తు వేగవంతం.. నేడు ఘటనా స్థలానికి రానున్న బృందం
- ఆసుపత్రిలో మృతదేహాల పరిశీలన
- హైకోర్టు జోక్యంతో రంగంలోకి
- 9న విచారణకు రానున్న కేసు
హైదరాబాద్ లో దిశ నిందితుల ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ఆర్ సీ) సభ్యులు ఈ రోజు సందర్శించనున్నారు. ఎన్‌కౌంటర్ పై విచారణ జరపాలని ఎన్ హెచ్ఆర్ సీ డైరెక్టర్ జనరల్ ఆదేశించడంతో సీనియర్ పోలీసు అధికారి ఆధ్వర్యంలోని బృందం రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా ఈ రోజు ఈ బృందం ఘటనా స్థలితోపాటు మహబూబ్ నగర్ ఆసుపత్రిని సందర్శించి అక్కడ భద్రపరిచిన మృతదేహాలను పరిశీలించనుంది. మరోవైపు హైకోర్టు కూడా ఈ ఘటన పై విచారణ చేపట్టింది.
వాస్తవానికి నిన్న ఎన్‌కౌంటర్ అనంతరం పంచనామా, పోస్టుమార్టం లాంచనాలు పూర్తి చేసి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించాలని పోలీసులు నిర్ణయించారు. సాయంత్రం మృతుల స్వగ్రామంలో అంత్యక్రియలకు కూడా ఏర్పాట్లు చేశారు. ఈలోగా హైకోర్టు జోక్యం చేసుకోవడంతో పోలీసుల ప్రయత్నాలకు బ్రేక్ పడింది.
ఈ నెల 9వ తేదీ వరకు మృతదేహాలను భద్రపరచాలని హైకోర్టు ఆదేశించింది. ఆ రోజున కోర్టు కేసు విచారించనుంది. అదే సమయంలో ఎన్ హెచ్ఆర్ సీ దర్యాప్తు కూడా ప్రారంభం కావడంతో తొమ్మిదో తేదీన కోర్టు ఏదో ఒక విషయం తెలియజేసే అవకాశం ఉంది. దీంతో నిందితుల గ్రామాల్లో పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.