Congress: కాంగ్రెస్ చీఫ్‌గా మళ్లీ రాహులే.. సంకేతాలిచ్చిన కేసీ వేణుగోపాల్!
- లోక్‌సభ ఎన్నికల తర్వాత అధ్యక్ష పదవికి రాజీనామా
- ఎంత మంది చెప్పినా ససేమిరా
- వచ్చే నెలలో రాహుల్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోనున్న ఏఐసీసీ నేతలు
లోక్‌సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న రాహుల్ గాంధీ తిరిగి ఆ పదవిని చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. అప్పట్లో ఎంతమంది నచ్చజెప్పినా పట్టువీడని రాహుల్ చివరికి అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. దీంతో ఇప్పటి వరకు ఆ పార్టీ అధ్యక్ష పదవి ఖాళీగానే ఉంది. తాజాగా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాహుల్ ఆంతరంగిక బృంద సభ్యుడు కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. రాహుల్ మళ్లీ పగ్గాలు చేపట్టబోతున్నట్టు సంకేతాలిచ్చారు.
ప్రస్తుత పరిస్థితుల్లో రాహుల్ అధ్యక్ష పదవిని చేపట్టడం అనివార్యమని అన్నారు. నేతలు, కార్యకర్తల మనోభావాలను ఆయన అంగీకరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, ఈ సమయంలో పార్టీకి ఆయన నాయకత్వం అవసరమని అన్నారు. వచ్చే నెలలో జరిగే ఏఐసీసీ విస్తృత స్థాయి సమావేశంలో రాహుల్‌ను అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటారని మరో నేత తెలిపారు.