Equador: నిత్యానంద మా దేశంలో లేరు.. హైతీకి వెళ్లారు: ఈక్వెడార్ ప్రభుత్వం ప్రకటన
- ఈక్వెడార్ నుంచి వెళ్లిపోయిన నిత్యానంద
- శరణార్థి అభ్యర్థన తోసి పుచ్చిన ఆ దేశం
- ఈక్వెడార్ నుంచి దీవి కొనుగోలు అవాస్తవం
అత్యాచారం సహా పలు కేసుల్లో నిందితుడిగా విచారణ ఎదుర్కొంటున్న వివాదాస్పద స్వామి నిత్యానంద మన దేశం విడిచి పారిపోయిన సంగతి తెలిసిందే. నిత్యానంద ఈక్వెడార్ దేశం నుంచి ఓ దీవిని కొనుగోలు చేశారని, దాన్ని కైలాస అనే పేరుతో స్వతంత్ర దేశంగా మార్చే ప్రయత్నాల్లో ఉన్నారనే వార్త కొన్ని రోజులుగా మీడియాలో హల్ చల్ చేస్తోంది.
దీనిపై దేశ రాజధాని ఢిల్లీలోని ఈక్వెడార్ రాయబార కార్యాలయం ఈరోజు స్పందించింది. నిత్యానంద తమ దేశానికి వచ్చిన మాట వాస్తమేనని, తనను శరణార్థిగా గుర్తించాలని అభ్యర్థన కూడా పెట్టుకున్నారని తెలిపింది. అయితే తాము ఆ అభ్యర్థనను తిరస్కరించడంతో ఆయన పొరుగునే ఉన్న హైతీకి వెళ్లిపోయారని వివరణ ఇచ్చింది.
అలాగే, తమ దేశం నుంచి నిత్యానంద దీవిని కొనుగోలు చేశారని వస్తున్న వార్తలు నిరాధారమైనవని, దయచేసి మీడియా ఇకనైనా ఈ విషయంలో తమ దేశం పేరు రాయకుండా ఉంటే మంచిదని హితవు పలికింది.