Internet: ఇంటర్నెట్ కు బానిసలా...అయితే 'నెట్ ఉపవాసం' చేయండి!
- సూచిస్తున్న నిపుణులు
- వారానికి ఒక రోజు దీన్ని పాటిస్తే ఫలితం
- రెండు మూడు నెలల్లోనే వికర్షణ మొదలు
పిల్లలు, పెద్దలు అన్న తేడా లేకుండా ఈ తరంలో ఇంటర్నెట్ కు బానిసలైనవారే అధికం. నిద్రపోయే సమయంలో తప్ప మిగిలిన సమయాల్లో ఎక్కువ సేపు 'నెట్టింట్లో' గడపడంతో సరి. ఇంట్లో కంప్యూటర్, చేతిలో సెల్ ఫోన్, బ్యాగులో ల్యాప్ టాప్...ఏదో ఒకదానికి పనిచెప్పకుండా ఉండలేని పరిస్థితి. రాత్రి తెల్లవారు జాము వరకు నెట్ లోనే మునిగితేలే జీవులు ఎంతోమంది. తొలుత అవసరం, ఆ తర్వాత ఆకర్షణ, చివరికది బానిసత్వంగా మారడంతో తప్పించుకోలేని పరిస్థితి.
ఇలా ఇంటర్నెట్ కు బానిసలైన వారికి ఓ రోజు ఉపవాసం చేయాలని సూచిస్తున్నారు నిపుణులు. ఉపవాసం అంటే భోజనం మానేయమని కాదండోయ్...నెట్ ఉపవాసం. అంటే ఓ రోజంతా ఇంటర్నెట్ కి దూరంగా ఉండడం అన్నమాట. ఇలా వారానికి ఒక రోజు నిబద్ధతతో పాటిస్తే రెండు మూడు నెలల్లోనే నెట్ పట్ల వికర్షణ మొదలవుతుందని, ఆ తర్వాత క్రమంగా నెట్ కు దూరం కావచ్చని వీరు తెలియజేస్తున్నారు. మీరు నెట్ కు బానిసలని భావిస్తున్నారా...అయితే ఇంకేం... ఈ వారం నుంచే ఉపవాసం మొదలు పెట్టండి మరి.