Tamil Nadu: తమిళనాడులో బీజేపీకి షాక్.. డీఎంకేలో చేరిన రాష్ట్ర ఉపాధ్యక్షుడు

  • స్టాలిన్ సమక్షంలో డీఎంకేలో చేరిన అరసకుమార్
  • బీజేపీలో తన గౌరవానికి భంగం వాటిల్లిందని వ్యాఖ్య
  • ఆ పార్టీలో క్రమశిక్షణ లేని నాయకులున్నారని విమర్శ

తమిళనాడులో బలపడాలనుకుంటున్న బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు బీటీ అరసకుమార్ డీఎంకే తీర్థం పుచ్చుకున్నారు. చెన్నైలోని డీఎంకే కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత స్టాలిన్ సమక్షంలో ఆయన డీఎంకేలో చేరారు.

అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ, బీజేపీలో తన ఆత్మగౌరవానికి భంగం వాటిల్లిందని చెప్పారు. ఆ పార్టీలో క్రమశిక్షణ లేని నాయకులు ఉన్నారని, అభ్యంతరకరమైన భాషను వారు వాడతారని విమర్శించారు. డీఎంకే తన మాతృ సంస్థ అని... అందుకే మళ్లీ తన సొంత పార్టీలో చేరానని చెప్పారు. గత 20 ఏళ్లుగా స్టాలిన్ తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. స్టాలిన్ ఒక గొప్ప నాయకుడని... తనకు ఎలాంటి బాధ్యతలను అప్పగించినా, స్వీకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు.

డిసెంబర్ 1న పుదుకొట్టాయ్ లో జరిగిన ఓ వివాహానికి హాజరైన అరసకుమార్... ఆ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. స్టాలిన్ ను ఎంజీఆర్ తో పోల్చారు. తమిళనాడుకు కాబోయే ముఖ్యమంత్రి స్టాలిన్ అని జోస్యం చెప్పారు. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర బీజేపీ శ్రేణుల నుంచి ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఆయనను ఆదేశించింది. ఈ పరిణామాల నేపథ్యంలో, ఆయన డీఎంకేలో చేరారు.

  • Loading...

More Telugu News