America: భారత వైమానిక దళ చీఫ్ బదౌరియాకు తృటిలో తప్పిన ప్రాణాపాయం
- పెర్ల్ హార్బర్ లో ఓ సెయిలర్ కాల్పులు
- ఆ సమయానికి అక్కడే ఉన్న బదౌరియా బృందం
- ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తుల మృతి
భారత్ వైమానిక దళాధిపతి (ఐఏఎఫ్) ఎయిర్ మార్షల్ ఆర్.కె.ఎస్.బదౌరియాకు తృటిలో ప్రాణాపాయం తప్పింది. అమెరికాలోని పెర్ల్ హార్బర్ లో ఓ సెయిలర్ జరిపిన కాల్పుల నుంచి ఆయన తప్పించుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఆ సమయానికి బదౌరియా బృందం అక్కడే ఉంది. కాల్పుల ప్రదేశానికి అదృష్టవశాత్తు కాస్త దూరంగా బదౌరియా బృందం ఉండడంతో ప్రాణాపాయం తప్పింది. ఘటనానంతరం నిందితుడు తనను తాను కాల్చుకుని చనిపోయాడు. అతను ఎందుకీ దాడికి పాల్పడ్డాడన్నది తెలియరాలేదు.
పసిఫిక్ ఎయిర్ చీఫ్ సింపోజియం (పీఏసీఎస్-2019)లో భాగంగా బదౌరియా బృందం అక్కడికి వెళ్లింది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన వైమానిక దళ చీఫ్‌లు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. ఈ ఘటన అనంతరం అధికారులు ఓ ప్రకటన చేస్తూ పీఏసీఎస్-2019 యథావిధిగా కొనసాగుతుందని తెలిపారు.