Madhya Pradesh: భార్యను హత్యచేసి, పాము కాటు వల్ల మరణించిందన్న బ్యాంక్ మేనేజర్!
- మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఘటన
- పోస్టుమార్టం నివేదికతో పోలీసులకు అనుమానం
- ముందే పామును కొనుక్కొచ్చి, దాన్ని చంపిన పటేరియా
- పలు సెక్షన్ల కింద కేసు నమోదు
తన భార్యను దారుణంగా హత్య చేసిన ఓ బ్యాంక్ మేనేజర్, అంతకుముందే ఓ పామును కొని తెచ్చుకుని, అది కాటేయడం వల్లే మరణించిందని డ్రామా ఆడి అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో జరిగింది.
పోలీసులు వెల్లడించిన వివరాల్లోకి వెళితే, ఓ బ్యాంకు మేనేజర్ గా పనిచేస్తున్న అమితేశ్ పటారియా, శివానీ భార్యాభర్తలు. వీరిద్దరి మధ్యా కొన్ని విభేదాలున్నాయి. ఈ క్రమంలో ఆదివారం నాడు శివానీ మృతి చెందింది. ఆమె చేతిలో పాము కోరలను ఉంచిన పటేరియా, తన భార్యను పాము కరిచిందని చుట్టుపక్కల వారికి చెప్పాడు. విషయం తెలుసుకున్న పోలీసులు, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం చేయించగా, గొంతు నులిమి హత్య చేసినట్టు తేలింది. దీంతో పటేరియాను గట్టిగా ప్రశ్నించగా, అసలు విషయం బయటపడింది. భార్య హత్యకు 11 రోజుల ముందు రాజస్థాన్ నుంచి ఓ నల్ల తాచుపామును రూ. 5000 పెట్టి కొన్నాడని, భార్య హత్య తరువాత పామును చంపాడని పోలీసులు తేల్చారు.
పటేరియాను అరెస్ట్ చేశామని, హత్య కేసుతో పాటు వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కూడా కేసు పెట్టామని అన్నారు. పటేరియాకు సహకరించిన ఆయన సోదరి రిచా చతుర్వేది, తండ్రి ఓం ప్రకాష్ పటేరియాలను కూడా అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు.