Jio: టారిఫ్ లను 39 శాతం పెంచిన జియో... అయినా ఎయిర్ టెల్, వోడాఫోన్ - ఐడియాలకన్నా తక్కువే!
- 6వ తేదీ నుంచి పెంచిన ధరలు అమలులోకి
- 300 శాతం అదనపు లాభాలు ఇస్తున్నామన్న జియో
- రూ. 399 ప్యాక్ ఇకపై రూ. 555
ఈ నెల 6వ తేదీ నుంచి మొబైల్ ఫోన్ల టారిఫ్ ను పెంచుతున్నట్టు రిలయన్స్ జియో ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న టారిఫ్ లతో పోలిస్తే 39 శాతం ధరలను పెంచిన జియో, ఈ ధరలు టెలికమ్ రంగంలోని ఇతర ప్రధాన సంస్థలు వసూలు చేస్తున్న ధరలతో పోలిస్తే తక్కువేనని వ్యాఖ్యానించింది. గతంలో ఉన్న ఆల్ ఇన్ వన్ ప్లాన్లతో పోలిస్తే, 300 శాతం అదనపు లాభాలను వినియోగదారులు పొందవచ్చని తెలిపింది.
రోజుకు 1.5 జీబీ డేటా, 84 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్యాక్ ధర ప్రస్తుతం రూ.399 ఉండగా, అది రూ. 555కు పెరిగింది. ఇప్పటివరకూ రూ. 153గా ఉన్న ప్లాన్ ధర, రూ.199 అయింది. రూ. 349 ప్లాన్ రూ. 399కి, రూ. 448 ప్లాన్ రూ. 599కి పెరిగాయి. ప్రస్తుతం ఏడాది ప్లాన్ కు రూ. 1,699 వసూలు చేస్తున్న సంస్థ, ఇకపై రూ. 2,199 వసూలు చేయనుంది. తాము అందిస్తున్న రూ. 199 ప్లాన్ ను ఇతర టెల్కోలు రూ. 249 అందిస్తున్నాయని జియో వ్యాఖ్యానించడం గమనార్హం. టారిఫ్ లో ఉన్న వ్యత్యాసాన్ని చూపుతూ ఓ టేబుల్ ను కూడా జియో విడుదల చేసింది.