Telugudesam: వరుసగా నాలుగేళ్లు రెండంకెల జీఎస్ డీపీ నమోదు చేసిన ఘనత మాదే: చంద్రబాబు

  • రాష్ట్రంలో పారిశ్రామికీకరణ వాతావరణాన్ని దెబ్బతీశారు
  • ద్రవ్యోల్బణం 5 శాతం పెరిగింది..ధరలు మండిపోతున్నాయి 
  • ముడుపుల కోసమే లిక్కర్ ధరలు 150 నుంచి 200 శాతం పెంచారు

తమ హయాంలో, దేశంలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జీఎస్ డీపీ( స్థూల రాష్ట్రీయ ఉత్పత్తి) లో వరుసగా నాలుగేళ్లపాటు రెండంకెల వృద్ధిని నమోదు చేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పారు. ఈ రోజు కర్నూలు పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీలోకి రూ.16 లక్షల పెట్టుబడులు రావడానికి తాము ప్రణాళికలు తయారు చేశామన్నారు. ఇప్పుడు అవన్నీ పోయాయన్నారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో పారిశ్రామికీకరణ వాతావరణాన్ని దెబ్బతీసిందన్నారు. కర్నూలును సోలార్ హబ్ గా తీర్చిదిద్దాలనుకున్నామంటూ... వైసీపీ ప్రభుత్వం నిర్వాకం వల్ల దేశంలోకి సోలార్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టాలంటే ఎవరూ ముందుకు రాని పరిస్థితి ఏర్పడిందన్నారు.

వైసీపీ అంచనా వేసిన రాష్ట్ర ఆదాయంలో క్షీణత నమోదైందన్నారు. అది 25 నుంచి 30 శాతందాకా పడిపోయిందని చెప్పారు. అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్య పరిస్థితులు నెలకొన్నాయని చెబుతూ.. వైసీపీ ప్రభుత్వం చేతులారా చేసుకున్న స్వయంకృతాపరాధంతో రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. ద్రవ్యోల్బణం 5 శాతం పెరిగిందన్నారు.

ధరలు మండిపోతున్నాయంటూ.. కిలో ఉల్లిపాయల ధర రూ.110 కి చేరిందని విమర్శించారు. ఇది ప్రభుత్వం చేతకానితనానికి నిదర్శనమన్నారు. ఏదో ఒక రైతు బజార్లో ఉల్లిపాయలు అమ్మకానికి పెడితే.. ప్రజలు వాటికోసం రోజంతా క్యూల్లో నిలబడాలా? అని ప్రశ్నించారు. మిగులు లేదా లోటు ఏర్పడ్డప్పుడు సమస్యలను అధిగమించడానికి, ముందుగా ప్రణాళికలు రూపొందించుకుంటే ఈ పరిస్థితి ఏర్పడేది కాదన్నారు. రాష్ట్రంలో రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేవని అన్నారు. అదే సమయంలో ప్రజలు కొనబోతే ధరలు ఆకాశనంటుతున్నాయన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం లిక్కర్ ధరలను 150 నుంచి 200 శాతం పెంచిందంటూ.. మద్యం తయారీ వ్యయం పెరగనప్పటికీ, ముడుపులు అందుకోవడానికే ధరలు పెంచారని ఆరోపించారు. పొరుగు రాష్ట్రాల్లోంచి మద్యం రాష్ట్రంలోకి వస్తోందన్నారు. బెల్టు షాపుల్ని, అక్రమంగా మద్యం తయారీని పట్టించుకోవడం లేదన్నారు.

ఇసుక విధానంపై ప్రభుత్వం చెప్పేదానికి, చేసేదానికి మధ్య పొంతనే లేదని ధ్వజమెత్తారు. 35 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్టకొట్టారన్నారు. కావలసిన వారికి పోలీసుల ఎస్కార్టుతో ఇసుకను సరఫరా చేస్తున్నారన్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలకు ఇసుక తరలిపోతోందని ఎత్తి చూపారు. సిమెంట్, స్టీల్ తదితర అనుబంధ రంగాలను దెబ్బతీశారని చెప్పారు. ఆన్ లైన్, స్టాక్ పాయింట్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.

  • Loading...

More Telugu News