justice for disa: నిబంధనల ఉల్లంఘన... ప్రసార మాధ్యమాల పై ఆ 'దిశ'గా చర్యలు?
- హైదరాబాద్ అత్యాచార బాధితురాలి ఫొటోలు, పేర్లు ప్రసారం చేయొద్దని సూచన
- పట్టించుకోని కొన్ని చానళ్లు, సామాజిక మాధ్యమాలు
- నోటీసులు జారీ చేయాలని నిర్ణయించిన పోలీసులు
అత్యాచార బాధితురాలి ఫొటో, పేర్లు, కుటుంబ సభ్యుల వివరాలు ప్రసారం, ప్రింట్ చేయడం నిషిద్ధమని పోలీసులు స్పష్టమైన ప్రకటన జారీచేసినా పట్టించుకోని చానెళ్లు, సామాజిక మాధ్యమాలపై చర్యలకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. దేశాన్ని కుదిపేసిన 'నిర్భయ' కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం, తొలి నుంచి ఆమె, కుటుంబ సభ్యుల వివరాలు బయటకు రాకుండా పోలీసులు జాగ్రత్త పడడంతో ఇప్పటికీ బాధితురాలు ఎలా ఉంటుందన్నది ఎవరికీ తెలియదు. అయితే శంషాబాద్ సమీపంలో జరిగిన వెటర్నరీ వైద్యురాలు దిశ హత్యాచార ఘటనలో ఈ నిబంధన పాటించలేదు. దీంతో బాధితురాలి పేరు, ఫొటో, కుటుంబ సభ్యుల వివరాలన్నీ తొలిరోజే బయటకు వచ్చేశాయి.
ఆ తర్వాత మానవ హక్కుల సంఘం మొట్టికాయలు వేసే పరిస్థితి ఎదురు కావడంతో పోలీసులు పొరపాటును గుర్తించి బాధితురాలి పేరును 'జస్టిస్ ఫర్ దిశ'గా మార్పుచేశామని, ఇక పై ఆమె ఫొటోలు, వివరాలు ప్రసారం చేయడం, ప్రింట్ చేయడం చట్ట ప్రకారం నేరమని ప్రకటించారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయినా కొంతలో కొంత బెటరని చాలామంది భావించారు.
కానీ ఇప్పటికీ కొన్ని చానెళ్లు, సామాజిక మాధ్యమాల్లో దిశ ఫొటో, వివరాలు తొలగించక పోవడం, వార్తల ప్రసారం సందర్భంగా వాటిని వినియోగిస్తుండడంపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దర్యాప్తులోని అంశాలను కూడా ప్రసారం చేయడాన్ని తప్పుపడుతున్న పోలీసులు సీఆర్‌పీసీ సెక్షన్ 149 ప్రకారం బాధ్యులకు నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు.