Tomato: ఇక టమోటా వంతు... ఒక్కరోజులో ధర రెట్టింపు!
- మదనపల్లి మార్కెట్ కు తగ్గిన పంట
- కిలో రూ. 48కి చేరిక
- హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు
ఇప్పటికే ఉల్లి ధరలు ఆకాశానికి తాకి, సామాన్యులను ఇబ్బందులు పెడుతుండగా, అదే దారిలోకి టమోటా కూడా వచ్చి చేరింది. నిన్నటివరకూ కిలోకు రూ. 24 వరకూ ధర పలికిన టమోటా, ఇప్పుడు దాదాపు రూ. 50కి చేరింది. తెలుగు రాష్ట్రాల్లోనే టమోటా పంట అత్యధికంగా వచ్చే మదనపల్లి మార్కెట్లో కిలో టమోటా ధర రూ. 48 పలికింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గత రెండు మూడు రోజులుగా భారీ వర్షాలు పడుతూ ఉండటంతో పంట దిగుబడి తగ్గిపోయింది. వర్షాల కారణంగా రైతులు పంటను కోయకుండా పొలాల్లోనే వదిలేశారు. వాస్తవానికి మదనపల్లి మార్కెట్ కు నిత్యమూ 300 టన్నుల వరకూ టమోటా వస్తుంటుంది. అది కాస్తా ప్రస్తుతం 220 టన్నులకు పడిపోయింది.
ఇదే సమయంలో విజయవాడ, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి టమోటాకు డిమాండ్ పెరిగింది. పెరిగిన ధరలు ప్రజలకు భారంగా మారినా, టమోటాను పండిస్తున్న రైతులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు నెలల క్రితం కిలోకు 25 పైసలు కూడా ధర రాక, రోడ్లపై పారబోసిన తమకు, ఇప్పుడు కొంత ఆనందంగా ఉందని అంటున్నారు.