YS Viveka Murder case Investigation: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిట్ దర్యాప్తు వేగవంతం
- ఈరోజు నలుగురిని విచారించిన సిట్ అధికారులు
- ప్రతిరోజు రెండు పార్టీలకు చెందిన అనుమానితులకు పిలుపు
- ఇప్పటివరకు 1300 మంది అనుమానితుల విచారణ పూర్తి
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తును వేగవంతం చేసింది. ఇప్పటివరకు ఈ కేసులో 1300 మంది అనుమానితులను సిట్ విచారించింది. తాజాగా మరో నలుగురిని పిలిచింది. ఒకేసారి ఒకే పార్టీ వారిని కాకుండా ప్రతిరోజు రెండు పార్టీలకు చెందిన అనుమానితులను పిలిచి విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
నిన్న నలుగురిని విచారించిన సిట్ ఈ రోజు పులివెందుల, సింహాద్రిపురం మండలాలకు చెందిన నలుగురు అనుమానితులను విచారించింది. వీరిలో పులివెందులకు చెందిన వైఎస్. మనోహర్ రెడ్డితోపాటు మరో వ్యక్తి ఉన్నారు. సాయంత్రం సింహాద్రిపురం మండలానికి చెందిన టీడీపీ మాజీ జడ్పీటీసీ సభ్యుడు పోరెడ్డి ప్రభాకర్ రెడ్డితోపాటు, ముసల్ రెడ్డి పల్లెకు చెందిన ఓ నేతను కూడా విచారించారు. వీరందరినీ కడపకు పిలిచి సిట్ విచారించింది. మార్చి 15న వివేక హత్య జరిగిన విషయం తెలిసిందే.