Without meals A Women living for 25 years period: ఇరవై ఐదేళ్లుగా.. అన్నం తినకుండా జీవిస్తోన్న మహిళ
- కేవలం పండ్లు, టీ మాత్రమే ఆహారంగా తీసుకుంటూ జీవనం
- ఇంటి పనులు, వ్యవసాయ పనులు చేసుకుంటూ ఆరోగ్యంగా జీవిస్తోన్న మహిళ
- వైద్యులకు కూడా అంతుచిక్కని ఆమె ఆరోగ్య రహస్యం
కర్నాటకలోని యాదగిరి జిల్లాకు చెందిన ఓ మహిళ ఇరవై ఐదేళ్లుగా అన్నం తినకుండా బతుకుతూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బసమ్మ అనే వృద్ధురాలు కేవలం పండ్లు, టీ మాత్రమే సేవిస్తూ.. జీవనాన్ని సాగిస్తోంది. 25 ఏళ్లుగా ఆమె ఇలాగే బతుకుతోంది. అయినప్పటికీ.. ఆమె ఆరోగ్యం చక్కగా ఉండటం గమనార్హం. బసమ్మ కుటుంబ సభ్యులు వివరాలను మీడియాకు వెల్లడించారు. గర్భవతిగా ఉన్నప్పుడు కూడా తన ఆహారంలో ఆమె ఎలాంటి మార్పులు చేయలేదని వారు చెప్పారు.
ఇరవై ఐదేళ్ల కింద ఆమె అన్నం తినేదని పేర్కొన్నారు. పెళ్లైన తర్వాత ఆరునెలలకు అన్నం తినగానే కడుపు నొప్పి వచ్చేదని, దీంతో అప్పటినుంచి ఆమె అన్నం తినడం మానేసిందని అన్నారు. మరోవైపు వైద్యులు కూడా ఆమె ఆరోగ్యాన్ని చూసి అబ్బుర పడుతున్నారని కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. బసమ్మ ఇంటి పనులతో పాటు, వ్యవసాయ పనులు కూడా చేస్తూ.. ఆరోగ్యంగా జీవిస్తోందని చెబుతున్నారు.