congress MLA Jaggareddy criticism on CM KCR: ఆర్టీసీ టికెట్ల ధరలు పెంచి ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు: జగ్గారెడ్డి
- పెంచిన ఛార్జీలను వెంటనే ఉపసంహరించాలని డిమాండ్
- కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం
- ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉన్నప్పటికీ.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిందన్న నేత
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె అయిపోయిందనుకుంటే మరో సమస్యను టీఆర్ఎస్ ప్రభుత్వం తెరపైకి తెచ్చిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. టికెట్ల ధరలు పెంచి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. సమ్మె విరమించి విధుల్లో చేరిన కార్మికులను సమర్థించిన సీఎం కేసీఆర్ ఆర్టీసీకి వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి, మరోవైపు టికెట్ల ధరలు పెంచి ఆ భారమంతా ప్రజలపై మోపారని మండిపడ్డారు. సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పెంచిన ఛార్జీలను వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. చార్జీలను తగ్గించకపోతే.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక, వాటిని తగ్గించడంతోపాటు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పారు.
పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉన్నప్పటికీ.. అధికారంలో ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిందన్నారు. అంతేకాక చార్జీలు కూడా పెంచలేదని ఈ సందర్భంగా పేర్కొన్నారు. మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ మాత్రం ఇందుకు విరుద్ధంగా ప్రవర్తించిందని విమర్శించారు. విలీనం సంగతిని ఉపేక్షించడమేకాక, టికెట్ల ఛార్జీలను పెంచి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. 2లక్షల కోట్లు రుణాలు తెచ్చి కాళేశ్వరం నిర్మించిన ప్రభుత్వం దానితో జరిగిన లాభమెంతో చెప్పాలని డిమాండ్ చేశారు.