Vikram Lander: చంద్రుడిపై కూలిపోయిన విక్రమ్ ల్యాండర్ ఆనవాళ్లను గుర్తించింది మన భారతీయుడే!

  • విక్రమ్ ఆనవాళ్లను గుర్తించిన చెన్నై ఇంజినీర్ సుబ్రమణియన్
  • ల్యాండ్ కావడానికి ముందు, క్రాష్ అయిన తర్వాత చిత్రాలను అధ్యయనం చేసిన వైనం
  • సుబ్రమణియన్ అధ్యయనాన్ని ప్రశంసించిన నాసా

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2లో భాగమైన విక్రమ్ ల్యాండర్ సాంకేతిక కారణాలతో కూలిపోయిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 6వ తేదీన చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో చివరి క్షణాల్లో అది క్రాష్ ల్యాండ్ అయింది. దాని ఆచూకీని కనిపెట్టడానికి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా తీవ్రంగా శ్రమించింది. చివరకు వాటి శకలాలను గుర్తించింది.

సెప్టెంబర్ 26న ఏ ప్రాంతంలో విక్రమ్ ల్యాండర్ కూలిందో గుర్తించామని, లూనార్ రికొన్నైస్సాన్స్ ఆర్బిటర్ (LRO) ల్యాండర్‌ ను గుర్తించిందని నాసా పేర్కొంది. ల్యాండర్ నుంచి కొన్ని శకలాలు చిందరవందరగా పడ్డాయని, 24 చోట్ల ఈ శకలాలు కనిపిస్తున్నాయని వెల్లడించింది. దాదాపు ఒక కిలోమీటర్ పరిధిలో విక్రమ్ ల్యాండర్ శకలాలు ఉన్నాయని తెలిపింది. 

అయితే దీన్ని తొలుత గుర్తించింది మాత్రం చెన్నైకి చెందిన ఓ సాధారణ ఇంజినీర్ షణ్ముగ సుబ్రమణియన్. విక్రమ్ ల్యాండర్ కూలిపోయిన ప్రాంతానికి సంబంధించిన చిత్రాలను అధ్యయనం చేసిన ఆయన ఎట్టకేలకు వాటి శకలాలు ఉన్న ప్రాంతాలను గుర్తించారు.

సెప్టెంబర్ 17న తీసిన చిత్రాలను సెప్టెంబర్ 26న నాసా విడుదల చేసింది. గతంలో అదే ప్రాంతానికి సంబంధించి తాము విడుదల చేసిన చిత్రంతో, విక్రమ్ ల్యాండర్ క్రాష్ అయిన తర్వాత విడుదల చేసిన చిత్రాన్ని పోల్చి చూసి, శకలాలను కనిపెట్టేందుకు యత్నించండంటూ ప్రజలను ఉద్దేశించి నాసా ఓ ప్రకటన విడుదల చేసింది.

ఈ నేపథ్యంలో సుబ్రమణియన్ వాటి ఆనవాళ్లను గుర్తించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విక్రమ్ ఆనవాళ్లను నాసా గుర్తించకపోవడం తనలో ఆసక్తిని పెంచిందని చెప్పారు. నాసా విడుదల చేసిన రెండు చిత్రాలను తన లాప్ టాప్ లో పక్కపక్కనే పెట్టుకుని తేడాను గమనించడం మొదలు పెట్టానని తెలిపారు. విక్రమ్ ఆనవాళ్లను గుర్తించడం చాలా కష్టమైన పనే అయినప్పటికీ.. తన వంతు ప్రయత్నాన్ని తాను చేశానని చెప్పారు. ఆ తర్వాత తాను కనుక్కున్నదాన్ని అక్టోబర్ 3న ట్విట్టర్ ద్వారా వెల్లడించానని తెలిపారు.

విక్రమ్ పయనించిన మార్గాన్ని తాను నిశితంగా అధ్యయనం చేశానని సుబ్రమణయన్ చెప్పారు. తనకు స్పేస్ టెక్నాలజీ అంటే చాలా ఇష్టమని... ఏ ఒక్క రాకెట్ లాంచ్ ను చూడటాన్ని కూడా తాను మిస్ కాలేదని తెలిపారు.

సుబ్రమణియన్ ఇచ్చిన సమాచారంపై ఆ తర్వాత నాసా మరింత లోతుగా అధ్యయనం చేసింది. రెండు నెలల తర్వాత విక్రమ్ ఆనవాళ్లను గుర్తించినట్టు అధికారికంగా ప్రకటించింది.

ఈ సందర్భంగా నాసాకు చెందిన ఓ అత్యున్నత శాస్త్రవేత్త మాట్లాడుతూ, సుబ్రమణియన్ అధ్యయనం అద్భుతమని కితాబిచ్చారు. విక్రమ్ ఆనవాళ్లను తాము గుర్తించడానికి ఆయన ఇచ్చిన సమాచారం ఎంతో ఉపయోగపడిందని చెప్పారు. నాసాకు చెందిన ఎల్ఆర్వోకు కానీ, చంద్రయాన్-2 మిషన్ కు కానీ సుబ్రమణియన్ కు సంబంధం లేదని.... కానీ, వ్యక్తిగత ఆసక్తితో తమ డేటాను ఉపయోగించుకుని... తాము గుర్తించలేని స్పాట్ ను గుర్తించారని ప్రశంసించారు. నాసా చిత్రాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశారని... ఒక్కో పిక్సెల్ ను నిశితంగా గమనిస్తూ స్పాట్ ను కనిపెట్టారని తెలిపారు.

  • Loading...

More Telugu News