AP DGP: కుంటి సాకులు చెప్పకుండా.. జీరో ఎఫ్ఐఆర్ లు నమోదు చేయండి: ఏపీ డీజీపీ ఆదేశాలు
- బాధితులకు అన్యాయం జరగకూడదు
- జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే ప్రాసిక్యూషన్ కు అర్హులవుతారు
- పోలీసుల భాష సరిగా లేదనే ఫిర్యాదులు ఇప్పటికీ వస్తున్నాయి
హైదరాబాద్ శివార్లలో దిశ హత్య కేసు ఉదంతంతో జీరో ఎఫ్ఐఆర్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. పోలీస్ స్టేషన్ పరిధితో సంబంధం లేకుండా... పీఎస్ కు వచ్చిన బాధితుల ఫిర్యాదులను స్వీకరించడమే జీరో ఎఫ్ఐఆర్. ఈ విషయంలో తాజాగా, ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ రాష్ట్ర పోలీసులకు కీలక ఆదేశాలను జారీ చేశారు.
పోలీస్ స్టేషన్లకు వచ్చే బాధితులకు కుంటి సాకులు చెప్పకుండా... జీరో ఎఫ్ఐఆర్ లు నమోదు చేయాలని ఆదేశించారు. బాధితులు అత్యవసర పరిస్థితుల్లో రక్షణ, న్యాయం కోసం పోలీస్ స్టేషన్లకు వస్తుంటారని... సమీప పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదులు చేస్తుంటారని... అయితే, మీ ప్రాతం మా పరిధిలోకి రాదంటూ ఫిర్యాదులను స్వీకరించడానికి పోలీసులు నిరాకరిస్తుంటారని ఆయన అన్నారు.
తమ నివాసం ఏ పరిధిలోకి వస్తుందో తెలుసుకుని, బాధితులు అక్కడకు వెళ్లే లోపల జరగాల్సిన ఘోరాలు జరిగిపోతుంటాయని గౌతమ్ సవాంగ్ చెప్పారు. బాధితులకు అన్యాయం జరగకుండా ఉండేందుకు జీరో ఎఫ్ఐఆర్ లు నమోదు చేయాలని ఆదేశించారు. జీరో ఎఫ్ఐఆర్ లు నమోదు చేయడానికి నిరాకరించేవారు ప్రాసిక్యూషన్ కు అర్హులవుతారని హెచ్చరించారు. రాష్ట్రంలో జీరో ఎఫ్ఐఆర్ లను అమలు చేస్తామని... వారం రోజుల్లో దీనికి సంబంధించిన సాఫ్ట్ వేర్ సిద్ధమవుతుందని ఆయన తెలిపారు. పోలీసులు వాడుతున్న భాష సరిగా లేదనే ఫిర్యాదులు ఇప్పటికీ వస్తున్నాయని... స్పందన కార్యక్రమంతో కొంత మార్పు వచ్చిందని చెప్పారు.