Pawan Kalyan: మతం మారిన జగన్ రెడ్డి కులాన్ని ఎందుకు వదలడం లేదు?: పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు
- జగన్ రెడ్డీ, మతం మారిన మీరు కులాన్ని వదిలేయండి
- ఆయనకు కులం, మతం, ఓట్లు, డబ్బులు అన్నీ కావాలి
- వైసీపీ అంటేనే రంగుల రాజ్యం
'నా కులం మాట తప్పని కులం' అన్న ముఖ్యమంత్రి జగన్ పై జనసేనాని పవన్ కల్యాణ్ విమర్శల వర్షం కురిపించారు. 'అసలు మతం మారాక కులం ఎక్కడి నుంచి వచ్చిందండీ జగన్ గారికి?' అని ఆయన ప్రశ్నించారు. మతం మారాక మీకు కులమెందుకండీ... వదిలేయండి కులాన్ని అంటూ వ్యాఖ్యానించారు.
నా మత విశ్వాసం ఇది, నా కులం ఇది అని జగన్ రెడ్డి మాట్లాడుతుంటారని... ఆయనకు ఒకటే చెప్పాలనుకుంటున్నానని... మతం మారాక కులాన్ని వదిలేయండి అని చెప్పారు. కులం కావాలి, మతం కావాలి, ఓట్లు కావాలి, డబ్బులు కావాలి, అన్నీ కావాలి అని ఎద్దేవా చేశారు. సమాజం మారింది, యువత మారింది... కానీ, రంగులే మారడం లేదని చెప్పారు. వైసీపీ అంటేనే రంగుల రాజ్యమని విమర్శించారు.
క్రిస్టియానిటీని అనుసరిస్తున్నవారికి కులం ఉండదని పవన్ కల్యాణ్ చెప్పారు. మతం మీద విశ్వాసం ఉన్నవారు చెట్టుకు కూడా హాని తలపెట్టరని... కానీ, జగన్ రెడ్డి చెట్లను నరికించేస్తారని అన్నారు. తిరుమలను గౌరవించాలని, అక్కడ అన్యమత ప్రచారం జరగకూడదని చెప్పారు. రాజ్యంగం స్వేచ్ఛ ఇచ్చింది కదా అని ఎలా పడితే అలా చేయకూడదని అన్నారు. రెచ్చగొట్టే పనులు చేస్తే గొడవలు అయిపోతాయని చెప్పారు. తన మతం హిందూ మతమని... అన్ని మతాలను గౌరవించాలని తన మతం చెబుతోందని అన్నారు. ఏ మతం వారు ప్రసాదం ఇచ్చినా తాను స్వీకరిస్తానని చెప్పారు. అన్ని మతాల్లో గొప్పదనం ఉంటుందని తెలిపారు.