Andhra Pradesh: ఉమ్మడి ఏపీలోనూ నమోదుకానంత అధికంగా టీఎస్ఆర్టీసీ నష్టాలు!
- ఉమ్మడి ఏపీలో గరిష్ఠ నష్టం రూ. 718 కోట్లు
- గత సంవత్సరం టీఎస్ఆర్టీసీ నష్టం రూ. 928 కోట్లు
- ఈ ఏడాది రూ. 1,200 కోట్లకు పెరిగే అవకాశం
- మరోసారి చార్జీలను పెంచాలని అధికారుల ప్రతిపాదనలు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ దాదాపు రూ. 1,200 కోట్ల నష్టాన్ని నమోదు చేస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఎన్నడూ ఇంత భారీ నష్టం నమోదు కాకపోవడం గమనార్హం. 2018-19 సంవత్సరంలో టీఎస్ఆర్టీసీ రూ. 928 కోట్ల నష్టాల్లో మునిగింది. ఈ సంవత్సరం అది వెయ్యి కోట్లను దాటుతుందన్న ఆలోచనలో అధికారులు ఉండగా, ఇటీవలి 52 రోజుల సమ్మె కారణంగా ఆ నష్టం మరో రూ. 200 కోట్లకు పైగా పెరుగుతుందని భావిస్తున్నారు.
ఇటీవల సీఎం కేసీఆర్ తో సమావేశమైన అధికారులు ఇదే విషయాన్ని స్పష్టం చేయడం గమనార్హం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ నమోదు చేసిన గరిష్ఠ నష్టం రూ. 718 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. ఇక నేటి నుంచి పెరిగిన టికెట్ల ధరలతో రూ. 850 కోట్ల వరకూ అదనపు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నప్పటికీ, సమ్మె ప్రభావంతో నష్టాలే నమోదవుతాయని అధికారులు అంటున్నారు.
ఇదే సమయంలో మరోసారి చార్జీలను పెంచాలన్న ప్రతిపాదనలనూ ఆర్టీసీ అధికారులు ప్రభుత్వం ముందుంచారు. ప్రస్తుతం 20 శాతం వరకూ చార్జీలను పెంచగా, మరో 10 శాతం పెంచితే, బ్రేక్ ఈవెన్ వస్తుందన్నది అధికారుల ఆలోచన. ఒకమారు లాభ నష్టాలు లేని స్థాయికి ఆర్టీసీని తీసుకువెళితే, ఆపై నెమ్మదిగా లాభాల్లోకి నడిపించే వీలుంటుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. అయితే, ఇప్పటికిప్పుడు చార్జీలను మళ్లీ పెంచితే, ప్రజల్లో వ్యతిరేకత వస్తుందన్న ఆలోచనతో ఉన్న సర్కారు, ఓ సంవత్సరం తరువాత చార్జీలను పెంచవచ్చని సమాచారం.