adhir ranjan chowdhury: కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్
- పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్
- మోదీ, షాలే వలసదారులన్న అధిర్ రంజన్
- మరి సోనియా సంగతేంటన్న బీజేపీ
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షాలను అవమానించేలా మాట్లాడిన కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి వెంటనే క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. పౌరసత్వ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా అధిర్ రంజన్ మాట్లాడుతూ.. గుజరాత్‌కు చెందిన నరేంద్రమోదీ, అమిత్‌షాలే అసలైన చొరబాటుదారులని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వారి నివాసాలు గుజరాత్లో ఉన్నా, వారు మాత్రం ఢిల్లీలో ఉంటున్నారని, వారే అసలైన వలసదారులని ఆరోపించారు. భారతదేశం అందరిదని, దేశం ఎవరి జాగీరు కాదని అన్నారు. ఇక్కడ అందరికీ సమాన హక్కులు ఉంటాయన్నారు.
పౌరసత్వ సరవణ బిల్లును వ్యతిరేకిస్తూ అధిర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఇటలీకి చెందిన సోనియాగాంధీ చొరబాటుదారులవుతారా? లేక, గుజరాత్‌కు చెందినవారా? అని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర ప్రశ్నించారు. చొరబాటుదారులున్న కాంగ్రెస్ పార్టీ ఇతరులను కూడా అదే దృష్టితో చూస్తోందని మంత్రి ప్రహ్లాద్ జోషి ఎద్దేవా చేశారు.