Priyanka Gandhi: అనుమతి లేకుండా ప్రియాంక గాంధీ నివాసంలోకి దూసుకొచ్చిన కారు
- గత నెల 25న ఘటన
- కారులో అమ్మాయి సహా ఐదుగురు వ్యక్తులు
- ఇటీవలే గాంధీలకు ఎస్పీజీ భద్రత ఉపసంహరించిన కేంద్రం
కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ నివాసంలోకి నవంబరు 25న ఓ కారు అనుమతి లేకుండా ప్రవేశించిన ఘటన ఆలస్యంగా వెల్లడైంది. జడ్ ప్లస్ భద్రత ఉన్న ప్రియాంక నివాసంలోకి కారు చొరబడడంతో అందరూ నివ్వెరపోయారు. ఆ కారులో ఓ అమ్మాయి సహా ఐదుగురు వ్యక్తులున్నారు. వారు కారు దిగి అప్పటికే గార్డెన్ లో ఉన్న ప్రియాంక వద్దకు వెళ్లారు. ముందస్తు అనుమతి లేకుండా భద్రత వలయాన్ని దాటుకుని ఓ కారు ప్రవేశించడం పట్ల ప్రియాంక ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
ఇటీవలే సోనియా, రాహుల్, ప్రియాంకలకు కేంద్రం ఎస్పీజీ భద్రతను ఉపసంహరించుకుని సీఆర్పీఎఫ్ కమెండోల ద్వారా జడ్ ప్లస్ భద్రత అందిస్తోంది. ఈ నేపథ్యంలో భద్రత వలయాన్ని దాటుకుని కారు ప్రవేశించడం పట్ల అధికారులు విచారణకు ఆదేశించారు. కాగా, కారులో ప్రియాంక నివాసంలో ప్రవేశించినవాళ్లు ఉత్తరప్రదేశ్ కు చెందినవారిగా గుర్తించారు. ప్రియాంకతో సెల్ఫీ కోసమే వచ్చినట్టు తెలుస్తోంది.