KCR: వెటర్నరీ డాక్టర్ హత్యోదంతంపై కేసీఆర్ ప్రకటన విడ్డూరంగా ఉంది: విజయశాంతి
- సంచలనం సృష్టించిన పశువైద్యురాలి ఘటన
- మూడ్రోజుల తర్వాత స్పందించారంటూ కేసీఆర్ పై విజయశాంతి ఆగ్రహం
- మొక్కుబడి ప్రకటనతో సరిపెట్టారంటూ విమర్శలు
యావత్ దేశాన్ని నివ్వెరపరిచిన శంషాబాద్ ఘటనపై తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి స్పందించారు. మృగాళ్ల చేతిలో అత్యంత దారుణంగా హతమైన వెటర్నరీ వైద్యురాలి ఘటనపై స్పందించడానికి సీఎం కేసీఆర్ కు మూడ్రోజులు పట్టిందని విమర్శించారు. మహిళా సంఘాలు, మీడియా వర్గాలు తీవ్రస్థాయిలో ప్రశ్నించడంతో మొక్కుబడిగా ఓ ప్రకటనతో సరిపెట్టారని, ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ అంటూ ప్రకటించి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. ఘటన జరిగిన వెంటనే స్పందించి ఉంటే విలువ ఉండేదని అన్నారు.
వెటర్నరీ వైద్యురాలి కుటుంబసభ్యుల పట్ల బాధ్యత లేకుండా మాట్లాడిన పోలీసులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో కేసీఆర్ చెప్పలేదని, ఫిర్యాదు అందిన వెంటనే మా పరిధి కాదు అంటూ జరిగే జాప్యంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వెల్లడించకుండా కేసీఆర్ తప్పించుకున్నారని విజయశాంతి ఆరోపించారు.